హడావిడి చదువులు, పోటీ పరీక్షలు, వెంటనే ఉద్యోగాల కోసం వెంపర్లాట.. ఇవే సర్వస్వంగా మారిపోయిన మన దేశంలో అంతకు మించి విభిన్నంగా ఆలోచిస్తున్న వారూ ఉన్నారు. అంతే కాదు ఇలాంటి వాళ్లు దేశం దాటి విదేశాలకు వెళ్లి మరీ కంపెనీల్ని ఏలుతున్నారు. కానీ పరీక్షలే సర్వస్వంగా భావిస్తున్న వారు మాత్రం ఇక్కడే ఉద్యోగాల కోసం చెప్పులు అరిగేలా తిరుగుతూ, చివరికి వచ్చిన దాంతో సరిపెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రెండుసార్లు ఐఐటీ (IIT)ప్రవేశ పరీక్షలో రెండుసార్లు విఫలమైన ఓ వ్యక్తి, తన ఆలోచన మార్చుకుని కెరీర్ ను ఎలా అందంగా తీర్చిదిద్దుకున్నాడో వివరిస్తూ లింక్డ్ ఇన్ లో ఓ పోస్టు పెట్టాడు.
ఐఐటీ పరీక్షలో విఫలం (IIT)
జీవితంలో ఒకసారి కాదు.. రెండుసార్లు IIT ప్రవేశ పరీక్షలో విఫలమయ్యాడు. ఆ క్షణంలో తన జీవితం ముగిసిపోయిందనే భావన కలిగిందని ఓ యువకుడు సోషల్ మీడియాలో పంచుకున్న భావోద్వేగ కథనం ఇప్పుడు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వైఫల్యం అంతిమం కాదని, పట్టుదల ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా మార్చుకోవచ్చని అతని ప్రయాణం నిరూపిస్తోంది. చిన్న పట్టణాల్లో పరీక్షలో విఫలమైతే అది వ్యక్తిగత విషయం కాదని, అందరి చూపులు, పోలికలు, మౌన విమర్శలు తనను తీవ్రంగా బాధించాయని అతను తెలిపాడు.
అప్పుడు స్వగ్రామాన్ని విడిచి మరో నగరంలోని ప్రభుత్వ కళాశాలలో చేరాడు. అది తన కలల కాలేజీ కాకపోయినా.. జీవితాన్ని మళ్లీ మొదలుపెట్టేందుకు దొరికిన ఒక అవకాశంగా భావించాడు. కుటుంబ పరిస్థితి బలంగా లేకపోవడంతో తల్లిదండ్రులు అతని చదువుకు అయ్యే ఖర్చు భరించలేకపోయారు. దీంతో ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని, పాఠశాల విద్యార్థులకు గణితం బోధిస్తూ తన ఖర్చులు తానే భరించాడు. కాలేజీ పూర్తయ్యాక క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా ఐటీ సపోర్ట్ ఉద్యోగంలో నెలకు రూ.20 వేల జీతంతో చేరాడు. ఉద్యోగం వచ్చినందుకు సంతోషమే అయినప్పటికీ, అక్కడే ఆగిపోవాలని మాత్రం అనుకోలేదు. ఉద్యోగం ముగిసిన తర్వాత ప్రతి సాయంత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML)ను స్వయంగా నేర్చుకోవడం ప్రారంభించాడు. ఖరీదైన కోర్సులు లేవు, మెంటర్ లేడు, కేవలం ఇంటర్నెట్, నేర్చుకోవాలనే తపన మాత్రమే ఉంది. ఆ తర్వాత తనకు AI/ML ప్రాజెక్టులో అవకాశం ఇవ్వాలని మరో మేనేజర్‌ను ఎలాగోలా ఒప్పించాడు. అదే తన కెరీర్‌ను పూర్తిగా మార్చేసిందని ఆ యువకుడు వెల్లడించాడు. AI రంగంలో ప్రారంభమైన ప్రయాణం తర్వాత ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, అక్కడి నుంచి బిజినెస్ లీడర్‌షిప్ వరకు తీసుకెళ్లిందని చెప్పాడు. చివరకు తాను అత్యంత పిన్న వయసులోనే ఒక పెద్ద సంస్థలో వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టినట్లు వెల్లడించాడు. ఈ ఏడాది మరో కీలక నిర్ణయం తీసుకుని ఉద్యోగం కోసం దుబాయ్‌కు వెళ్లాడు. విజయానికి కూడా మూల్యం ఉంటుంది. అయితే కెరీర్‌పై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఆరోగ్యం, వ్యక్తిగత సంబంధాలను నిర్లక్ష్యం చేశాడు. విజయం ఎన్నో ఇస్తుంది. కానీ మనం గమనించకపోతే కొన్ని విలువైన విషయాలను కూడా తీసుకుపోతుందని అతను ఇప్పుడు చెప్తున్నాడు. అసాధారణమైన జీవితాన్ని నిర్మించాలంటే పరిపూర్ణమైన ప్రారంభం అవసరం లేదని, కావాల్సింది పట్టుదల, కష్టపడే తత్వం మాత్రమే అంటున్నాడు. కొన్నేళ్లు ఒక లక్ష్యంపై పూర్తిగా దృష్టి పెడితే మన జీవితమే మారిపోతుందని గర్వంగా పేర్కొన్నాడు. ఒకప్పుడు ఇంట్లో పాలు కొనడానికే ఇబ్బంది పడిన కుటుంబం.. ఇప్పుడు అవసరమైనది కొనుగోలు చేయడానికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి లేదని చెప్తున్నాడు. అతని సక్సెస్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రూటు మార్చి కాలేజీలో చేరి
ఏఐ, ఎంఎల్ కోర్సులు నేర్చుకుని
దుబాయ్ కు చేరిన కెరీర్