కృత్రిమ మేధస్సు (AI) శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో, ఐఐటీ (IIT)ల వంటి ఉన్నత విద్యాసంస్థల్లో డిగ్రీలు చదవడం ఇప్పటికీ అవసరమా అనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతోంది. ఇంటర్నెట్ ఉంటే చాలు ఎలాంటి సమాచారమైనా ఈజీగా లభిస్తున్న నేపథ్యంలో, ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల ప్రాధాన్యత తగ్గిపోతుందా అనే చర్చ నడుస్తోంది. దీనిపై ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి శిఖర్ అగర్వాల్ ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు.
ఏఐ యుగంలో ఐఐటీ డిగ్రీ (IIT)
ఐఐటీ బాంబే నుంచి బీటెక్ పూర్తి చేసిన శిఖర్ అగర్వాల్, ప్రస్తుతం ఒక స్టార్టప్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. సమాచారాన్ని అందించడంలో ఏఐ ఎంతగానో తోడ్పడుతుందని, కానీ ఒక విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగడానికి అవసరమైన వాతావరణాన్ని అది సృష్టించలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఐఐటీలలో లభించే పుస్తక జ్ఞానం కంటే, అక్కడ చదువుకునే తోటి విద్యార్థుల ఆలోచనలు, వారి ప్రతిభే మన వ్యక్తిత్వాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.
శిఖర్ అగర్వాల్ తన ఐఐటీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ.. తరగతి గదుల్లో నేర్చుకున్న పాఠాల కంటే, క్లాస్‌మేట్స్‌తో గడిపిన సమయమే తన ఆలోచనా విధానాన్ని మార్చేసిందని చెప్పారు. నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ, క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలు కనుగొనే ప్రతిభావంతుల మధ్య ఉండడం వల్ల మన లక్ష్యాలు కూడా పెద్దవిగా మారుతాయని ఆయన తెలిపారు. దీనికోసం ఆయన 'గోల్డ్‌ఫిష్’ ఉదాహరణను ప్రస్తావించారు. చిన్న నీటి కుండీలో ఉండే చేప చిన్నదిగానే ఉంటుందని, అదే చేపను పెద్ద చెరువులో వదిలితే అది పూర్తి స్థాయిలో ఎదుగుతుందని శిఖర్ వివరించారు. ఐఐటీ బాంబే తమకు అలాంటి ఒక గొప్ప వాతావరణాన్ని అందించిందన్నారు. సాంకేతికత ద్వారా కోడింగ్ లేదా సైన్స్ వంటి రకరకాల అంశాలను ఆన్‌లైన్‌లో సులభంగా నేర్చుకోవచ్చు. కానీ, తోటి విద్యార్థుల మధ్య ఉండే ఆరోగ్యకరమైన పోటీ, కలిసి పనిచేసే తత్వం ఏఐతో సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ఐఐటీల విలువను కేవలం ప్లేస్‌మెంట్‌లు, భారీ జీతాల ప్యాకేజీలతో మాత్రమే కొలవకూడదని ఈ పూర్వ విద్యార్థి అభిప్రాయపడ్డారు. అక్కడ దొరికే స్నేహితులు, ఆలోచనలు పంచుకునే నెట్‌వర్క్ జీవితాంతం ఒక ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు. సమాచార లభ్యతలో ఏఐ ఎంత వేగంగా దూసుకుపోతున్నప్పటికీ, అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో లభించే ఆ మానవ సంబంధాలు మరియు ఉన్నతమైన వాతావరణం ఎప్పటికీ ఏఐ స్థానంలోకి రాలేవని ఆయన విశ్లేషణ స్పష్టం చేస్తోంది.తోటి విద్యార్థులే ఐఐటీ అసలు బలం
ఏఐతో సాధ్యం కానిది
ఐఐటీల విలువ కొలవాల్సింది వీటితోనే