అద్భుతం ఈ గోధుమ రవ్వ పాయసం..ఇలా చేసుకు తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు!

హిందూ సంప్రదాయంలో పండుగలు, శుభకార్యాల సమయంలో దేవుడికి నైవేద్యం సమర్పించడం అనేది ఒక ముఖ్యమైన ఆచారంగా వస్తోంది. ఈ ప్రసాదాల అన్నింటిలోకి అత్యంత నియమబద్ధంగా, ప్రశస్తంగా తయారు చేసే వంటకం పరమాన్నం. దేవతలకు సమర్పించే అత్యున్నతమైన అన్నం కాబట్టే దీనికి 'పరమాన్నం' అనే పేరు వచ్చింది. దీనిని సాధారణంగా బియ్యంతో తయారు చేసినప్పటికీ పండుగ పూజలకు ఒక ప్రత్యేక రుచిని అందించేందుకు వివిధ రకాల ధాన్యాలను వాడుతుంటారు.

Advertisement

గోధుమ రవ్వ పరమాన్నం తయారీ

పండుగ నైవేద్యాల కోసం మరింత రుచికరంగా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే విధంగా గోధుమ నూకతో పరమాన్నం ప్రయత్నించి చూడండి. అయితే బెల్లంతో పరమాన్నం చేసేటప్పుడు చాలా మందికి పాలు విరిగిపోతాయనే భయం ఉంటుంది. ఈ ఇబ్బంది వల్లే కొందరు పండుగ ప్రసాదాలలో బెల్లానికి బదులుగా చక్కెర వాడుతుంటారు. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా అచ్చమైన సంప్రదాయ రుచితో గోధుమ నూక పరమాన్నాన్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

Advertisement

గోధుమ రవ్వ పరమాన్నానికి అవసరమైన పదార్థాలు

గోధుమ నూక (ఎర్ర రవ్వ): ముప్పావు కప్పు (3/4 Cup)

బెల్లం తురుము: ఒకటిన్నర కప్పు కంటే కొంచెం ఎక్కువగా

పాలు: అర లీటరు

నీళ్లు: రెండున్నర కప్పులు (బెల్లం కొరకు మరికొన్ని)

నెయ్యి: ఆరు టేబుల్ స్పూన్లు

యాలకుల పొడి: నాలుగు యాలకులు (దంచినవి)

ఎండు లేదా పచ్చి ఖర్జూరం: నాలుగు (సన్నని ముక్కలు)

జీడిపప్పు, బాదం పలుకులు:రెండు టేబుల్ స్పూన్లు

కుంకుమపువ్వు: చిటికెడు

గోధుమ నూక పరమాన్నం తయారు చేసే విధానం

కనీసం అరగంట ముందుగా గోధుమ నూకను రెండు సార్లు కడిగి తగినన్ని నీళ్లలో నానబెట్టుకోవాలి. రవ్వ నానడం వల్ల పరమాన్నం త్వరగా ఉడకడమే కాకుండా ఎంతో మెత్తగా వస్తుంది. మరోపక్క ఒక పాత్రలో బెల్లం తురుము, పావు కప్పు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి ఒక పొంగు వచ్చేవరకు మరిగించి పక్కన ఉంచుకోవాలి. ఈ నీటిని వడకట్టడం వల్ల బెల్లంలో ఉండే ఇసుక, ఇతర నలకలు తొలగిపోతాయి.

Advertisement

ఇలా కలుపుతూ వండితే సూపర్ టేస్ట్

ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో అర లీటర్ పాలు, ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. పాలు మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న గోధుమ నూకను వేసి బాగా కలుపుతూ ఉడికించాలి.రవ్వ పూర్తిగా మెత్తగా ఉడికినట్లు నిర్ధారించుకున్న తర్వాత అందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఖర్జూరం, బాదం పలుకులు, దంచిన యాలకుల పొడి కలపాలి. మరో మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించండి.

నెయ్యి పైకి తేలేవరకు ఉడికితేనే టేస్ట్

ఇవన్నీ రవ్వలో చక్కగా కలిసిపోయేలా గరిటతో కలపాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న బెల్లం సిరప్‌ను వడకట్టి ఉడికిన రవ్వ మిశ్రమంలో పోయాలి. దాంతోపాటు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి, చిటికెడు కుంకుమపువ్వు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం దగ్గరపడి నెయ్యి పైకి తేలేవరకు తక్కువ మంటపై ఉడికించాలి. మళ్లీ రెండు స్పూన్ల నెయ్యి వేసి కలపాలి.

Advertisement

రుచికరమైన, నోరూరించే గోధుమ నూక పరమాన్నం

చివరగా మిగిలిన నెయ్యిని కూడా వేసి మరో మూడు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన, నోరూరించే గోధుమ నూక పరమాన్నం సిద్ధమవుతుంది. దీనిని వేడివేడిగా సమర్పించినా లేదా చల్లారిన తర్వాత తిన్నా అమృతంలా ఉంటుంది. పండుగ రోజుల్లో నైవేద్యంగా పెట్టడానికి ఇది ఎంతో పవిత్రమైన మరియు ఆరోగ్యకరమైన వంటకం.

English Summary

godhuma ravva payasam: Craving the perfect traditional wheat rava paramannam? know how to make traditional wheat ravva paramannam, perfect recipe with these cooking tips.