ఏపీలో గిరిజనులకు ఊహించని ఆదాయం.. గంజాయి సాగైనచోట ఆ కాశ్మీరీ పంటకు బిగ్ ప్లాన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మన్యం ప్రాంతంలోని గిరిజనులకు ఊహించని ఆదాయం అందించే సరికొత్త ప్లాన్ చేస్తుంది. ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం లోనే కొత్త అధ్యాయాన్ని లిఖించ డానికి శరవేగంగా అడుగులు వేస్తోంది. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కొత్త మార్గం చూపుతూ గంజాయి సాగు చేస్తున్న చోట బంగారు పంటలు పండించడానికి ప్లాన్ చేస్తోంది.

Advertisement

లక్షల ఆదాయాన్ని అందించే కుంకుమ పువ్వు సాగు ఏపీలో

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి ప్రాంతంలో లక్షల ఆదాయాన్ని అందించే కుంకుమ పువ్వు సాగును ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఉద్యానవన శాఖ ఈ ప్రాజెక్టును రూపొందించి, చింతపల్లి ప్రాంతంలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుంది. ఇప్పటివరకు జమ్మూ కాశ్మీర్లోని చల్లని ప్రాంతాలకు పరిమితమైన ఈ అత్యంత విలువైన పంటను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మన్యం ప్రాంతాలలో పండించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

చింతపల్లిలో కాశ్మీర్ లోని పాంపోర్ ప్రాంత వాతావరణం

చింతపల్లి, లంబసింగి పరిసరాలలో శీతాకాలంలో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. ఇవి కాశ్మీర్లోని పాంపోర్ ప్రాంత వాతావరణానికి దగ్గరగా ఉన్నాయని గమనించిన నిపుణులు, చింతపల్లిలో ఉన్నటువంటి మట్టి సారం, తేమశాతం కుంకుమపువ్వు దుంపలు పెరగడానికి అనుకూలంగా ఉన్నాయని ప్రాథమిక అంచనా వేశారు. ఈ క్రమంలోనే ఇక్కడ కుంకుమ పువ్వు సాగు చేసే ప్రయత్నం చేయనున్నారు.

పైలెట్ ప్రాజెక్ట్ గా కుంకుమ పువ్వు సాగు

చింతపల్లి లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానం పర్యవేక్షణలో ఈ సాగు చేపడతారు. మార్కెట్లో ఒక కిలో కుంకుమ పువ్వు ధర రెండు లక్షల నుండి 3లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఒకవేళ ఈ ప్రయోగం సక్సెస్ అయితే గిరిజనరైతులు సంప్రదాయ పంటలు కంటే ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది. దీనికోసం ఏపీ ప్రభుత్వం కాశ్మీర్ నుంచి నాణ్యమైన విత్తన దుంపలను తెచ్చి రైతులకు ఉచితంగా లేదా రాయితీపైన ఇవ్వనుంది.

Advertisement
అమరావతి రోప్ వే ప్రాజెక్టుకు ఆమోదం.. దుర్గమ్మదర్శనం, కృష్ణమ్మ అందాలే కాదు.. అవికూడా!

ఒకప్పుడు గంజాయి సాగు చేసిన చోట ఇప్పుడు కుంకుమపువ్వు

కాశ్మీర్ శాస్త్రవేత్తల మార్గదర్శకత్వంలో ఈ పంటను సాగు చేసే పద్ధతులు, నిర్వహణ, దిగుబడి సేకరణ వంటి వాటికి శిక్షణ కూడా ఇచ్చి పంట సాగు చేస్తారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే జిల్లావ్యాప్తంగా దీనిని విస్తరించే అవకాశం ఉంది. దీంతో చింతపల్లి వాసులకు ఉపాధి పెరగడం మాత్రమే కాకుండా, పర్యాటకంగా కూడా చాలా గుర్తింపు వస్తుంది. ఒకప్పుడు గంజాయి సాగు చేసిన ఈ ప్రాంతంలో ఉద్యానవన శాఖ అధికారుల ఆలోచనతో కుంకుమపువ్వు గుభాళించనుంది.

English Summary

saffron farming in chintapalli: Andhra Pradesh Horticulture Department launches pilot project for saffron farming in the high-altitude tribal areas of Chintapalli to boost tribal farmers’ income with the high-value “saffron” crop.