శ్రీశైలం వెళ్తున్నారా? నల్లమలలో ఆంక్షలు, 3నెలలు నో ఎంట్రీ!

శ్రీశైలం వెళ్ళే భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన వార్త. నల్లమల అటవీ సౌందర్యం, వన్య ప్రాణుల సంరక్షణ కోసం అటవీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జులై 1వ తేదీ నుండి సెప్టెంబర్ 30 వ తేదీవరకు మూడు నెలల పాటు నల్లమల అటవీ ప్రాంతంలో అటవీ అధికారులు పర్యాటకులకు నిషేధం విధించారు. కనుక నల్లమల అటవీ ప్రాంతంలో సాధారణ ప్రజలు, పర్యాటకులు, శ్రీశైలం వెళ్ళే భక్తులకు కీలక అలెర్ట్ ఇచ్చారు అటవీ అధికారులు.

Advertisement

నల్లమలలో ఆంక్షల వెనుక ముఖ్య ఉద్దేశం ఇదే

నాగార్జున సాగర్-శ్రీశైలం పులి అభయారణ్యం భారతదేశంలోని ముఖ్యమైన పులి సంరక్షణ కేంద్రాల్లో ఒకటి. గతేడాది ఇక్కడ 90 పులులు నమోదయ్యాయి. ఇందులో 32 మగ, 40 ఆడ పులులు ఉన్నాయి. జులై నుంచి సెప్టెంబర్ మధ్య కాలం పులుల పునరుత్పత్తికి అత్యంత అనుకూలమైన సమయం.పులుల సంతానోత్పత్తి కాలం కావడంతో వాటికి ఏకాంతం కల్పించడమే ఈ ఆంక్షల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.

Advertisement

మూడు నెలల కాలంలో జంగిల్ సఫారీలు పూర్తిగా బంద్

ఈ కాలంలో మనుషుల రాకపోకల వల్ల పులులకు ఇబ్బంది కలగకుండా, వాటి సహజ ప్రవర్తనకు అంతరాయం ఏర్పడకుండా ఈ చర్యలు తీసుకున్నారు. అడవిలోకి ప్రవేశించినవారిపై పులులు దాడి చేసే అవకాశం ఉండటంతో కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ మూడు నెలల కాలంలో జంగిల్ సఫారీలు పూర్తిగా నిలిపివేశారు. మార్కాపురం, ఆత్మకూరు, నంద్యాల అటవీ డివిజన్లలోని సఫారీ సేవలు రద్దు చేశారు.

ఈ రూట్లలో భక్తులు జాగ్రత్త

అలాగే అడవి ప్రాంతంలోని ఇష్టకామేశ్వరీ దేవి ఆలయం, రుద్రకోడూరు క్షేత్రం, గుండ్ల బ్రహ్మేశ్వర ఆలయం వంటి పుణ్యక్షేత్రాల సందర్శనకు కూడా అనుమతి ఉండదు. శ్రీశైలం ఆలయం వైపు వెళ్లే మార్గాల్లో భాగమైన నల్లమల జంగిల్ రూట్లలో భక్తులు జాగ్రత్తగా ఉండాలి. అయితే బఫర్ జోన్‌లలో ఉన్న ఎకో టూరిజం స్థలాల్లో కొంతవరకు విడిది సాధ్యమవుతుంది.

Advertisement

వన్య ప్రాణుల కోసం ఈ నిర్ణయం

అటవీ శాఖ అధికారులు భక్తులు, పర్యాటకులు, స్థానికులందరూ ఈ ఆంక్షలను గౌరవించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నల్లమల అడవిలో పులులతో పాటు చిరుతపులులు, ఎలుగుబంట్లు, దుప్పులు, వివిధ రకాల పక్షులు సమృద్ధిగా ఉన్నాయి. వర్షాకాలంలో ప్రకృతి పునరుజ్జీవనం పొందుతుంది. ఈ సమయంలో వన్యప్రాణులకు అంతరాయం కలగకుండా చూడడం ద్వారా జీవవైవిధ్యాన్ని కాపాడవచ్చు.

ఆంక్షలతో పులుల పునరుత్పత్తి

ప్రతి ఏటా ఈ కాలంలో అమలు చేసే ఈ ఆంక్షలు పులుల సంఖ్య పెరగడానికి దోహదపడుతున్నాయి. గతంలో 85 పులులు ఉండగా ఇప్పుడు 90కి పెరగడం ఇందుకు నిదర్శనం. అటవీ శాఖ ఈ నిర్ణయం ద్వారా పర్యావరణ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ,ముఖ్యంగా పులుల పునరుత్పత్తికి దోహదం చేస్తుంది.

English Summary

srisailam devotees alert: No entry to Nallamala Forest for three months from July 1 to September 30. Restrictions imposed for tiger breeding season. Srisailam devotees and tourists advised to take note; Jungle safaris and temple visits inside forest suspended.