అమరావతిలో రూ. 150 కోట్లతో మరో వరల్డ్ క్లాస్ ప్రాజెక్ట్!

రాజధాని అమరావతిలో నిర్మించ తలపెట్టిన సరికొత్త స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ప్రాజెక్ట్ భారీ వ్యయంతో అత్యంత ఆధునికంగా రూపుదిద్దుకోబోతోంది. మొత్తం రూ.150 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ స్టేట్ సెంట్రల్ లైబ్రరీకి సంబంధించిన పనులను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా సన్నాహాలు చేస్తోంది. దీని శంకుస్థాపన కార్యక్రమాన్ని త్వరలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అధికారులు కసరత్తు పూర్తి చేశారు.

Advertisement

19.60 ఎకరాల విస్తీర్ణంలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ

ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ 19.60 ఎకరాల విస్తీర్ణంలో భారీ భూమిని కేటాయించింది. కేవలం ఒక లైబ్రరీ భవనానికే పరిమితం కాకుండా, ఈ ప్రాంగణంలోనే తెలుగు సాంస్కృతిక కేంద్రాన్ని కూడా నిర్మించనున్నారు. దీనితో పాటు మానవ వనరుల అభివృద్ధి సంస్థ భవనాన్ని కూడా ఇదే ప్రాంగణంలో అంతర్జాతీయ సౌకర్యాలతో సమగ్రంగా నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

Advertisement

దుబాయ్ సంస్థ రూ.100 కోట్ల భారీ విరాళం

ఈ ప్రతిష్టాత్మక లైబ్రరీకి అవసరమైన అత్యధిక నిధులను సమకూర్చడంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) భాగస్వామ్యం కీలక భూమిక పోషిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు కావలసిన రూ.150 కోట్ల వ్యయంలో ఏకంగా రూ.100 కోట్లను దుబాయ్‌కు చెందిన స్థిరాస్తి వ్యాపార సంస్థ 'శోభా గ్రూప్' విరాళంగా అందించేందుకు ముందుకు వచ్చింది. మిగిలిన రూ.50 కోట్ల నిధులను ప్రైవేట్ దాతలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల నుండి సేకరిస్తారు.

జీ+5 అంతస్తుల భవనంగా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ

నూతనంగా నిర్మించనున్న ఈ స్టేట్ సెంట్రల్ లైబ్రరీని అత్యాధునిక మౌలిక వసతులతో కూడిన జీ+5 అంతస్తుల భవనంగా తీర్చిదిద్దబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ చారిత్రక వారసత్వ సంపదను, ప్రత్యేక సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ అంతస్తుల నిర్మాణం సాగుతుంది. దాదాపు 10 లక్షలకు పైగా గ్రంధాలను ఇక్కడ పాఠకులకు అందుబాటులో ఉంచేల భారీ వ్యవస్థను సిద్ధం చేయనున్నారు. ఒకేసారి గరిష్ఠంగా 2,500 మంది పాఠకులు ప్రశాంతంగా కూర్చుని చదువుకునేలా అత్యాధునిక వసతులు కల్పిస్తున్నారు.

Advertisement

దేశంలోనే అతిపెద్ద గ్రంథాలయాల్లో ఒకటిగా అమరావతి స్టేట్ సెంట్రల్ లైబ్రరీ

దేశంలోనే అతిపెద్ద గ్రంథాలయాల్లో ఇది ఒకటిగా నిలవబోతోంది. గ్రంథాలయ భవన నిర్మాణ శైలి చారిత్రక పరిజ్ఞానాన్ని, స్థానిక ప్రాముఖ్యతను మేళవిస్తూ సాగుతుంది. భవన శోభను పెంచే నిమిత్తం 108 స్తంభాలను చారిత్రక ప్రాధాన్యం గల అమరావతి బౌద్ధ స్తూపాల ఆకృతిలో తీర్చిదిద్దుతున్నారు. అదే విధంగా లోపలి భాగంలో ఉండే మెట్లను సమున్నత చరిత్ర కలిగిన గుహల తరహాలో అంటే ఉండవల్లి గుహల ఆకృతిని గుర్తుకు తెచ్చేలా అత్యంత ఆకర్షణీయంగా రూపొందిస్తున్నారు. దీన్తి ఈ లైబ్రరీ భవనం ఒక విద్యా కేంద్రంగానే కాకుండా ఒక అద్భుత పర్యాటక ఆకర్షణగా కూడా కనువిందు చేయనుంది.

English Summary

state central library in amaravati: The foundation stone for the construction of a central library in the capital, costing ₹150 crore, will be laid this month. A Dubai-based firm will provide ₹100 crore for the project. world-class library is set to be established in Amaravati.