ఏపీలో లక్షలాది మంది విద్యార్ధులు ఎదురుచూస్తున్న తల్లికి వందనం (Talliki Vandanam) పథకం డబ్బుల జమపై ప్రభుత్వం ఇవాళ కీలక ప్రకటన చేసింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తల్లికి వందనం డబ్బుల్ని ఈ నెలలో ఏయే తేదీల్లో జమ చేస్తారో వివరిస్తూ ఓ ప్రకటన చేశారు. దీని ప్రకారం ఈ నెల 16, 17, 18 తేదీల్లో తల్లికి వందనం డబ్బుల్ని తల్లుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
తల్లికి వందనం పథకంలో భాగంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం ప్రతీ ఒక్కరికీ ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ రూ.13 వేల చొప్పున జమ చేస్తోంది. ఈ ఏడాది కూడా ఈ పథకానికి దరఖాస్తుల్ని పాఠశాలల ద్వారా ఆహ్వానించారు. ఇలా వచ్చిన దరఖాస్తుల్ని క్షేత్రస్థాయి పరిశీలనకు ప్రభుత్వం పంపింది. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్ధాయిలో ఈ నిధులు అందుకునేందుకు అర్హులైన తల్లుల్ని గుర్తిస్తున్నారు. త్వరలో ఈ జాబితా సిద్దం కానుంది.
అనంతరం మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కు ప్రభుత్వం ప్లాన్ చేసింది. అదే సమయంలో అంటే ఈ నెల 16-18 తేదీల మధ్య తల్లికి వందనం పథకం నిధుల్ని తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే విద్యార్ధులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్ లను ఇవ్వకపోవడం, పాఠ్యపుస్తకాలు సైతం పూర్తి స్ధాయిలో అందించకపోవడం, తల్లికి వందనం పథకం డబ్బులు కూడా జమ చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూలై నెల మూడో వారంలో ఈ కార్యక్రమాలన్నీ వరుసగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.