లడ్డూ కల్తీపై నేడు తేల్చేయనున్న టీటీడీ బోర్డు
తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం నేడు జరగనుంది. ఈ సమావేశంలో కల్తీ నెయ్యి సరఫరా ఆరోపణలపై ఏకసభ్య కమిషన్ వెల్లడించిన నివేదికపై విస్తృత చర్చ జరిగే అవకాశం ఉంది. కల్తీకి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒక తీర్మానం బోర్డు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ అంశాన్ని బోర్డు భేటీలో ప్రస్తావిస్తానని సభ్యుడు జీ భానుప్రకాష్ రెడ్డి ఇదివరకే స్పష్టం చేశారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలోని కమిషన్ ఇచ్చిన నివేదికను ఆయన ఉటంకించారు. కొనుగోళ్లలో వివిధ స్థాయిలలో జరిగిన లోపాలు నాసిరకం నెయ్యి సరఫరాకు దారితీశాయని ఆ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారని వివరించారు. ఈ కొనుగోళ్లలో జరిగిన లోపాలను అనుమతించినందుకు భానుప్రకాష్ రెడ్డి పలువురు మాజీ ఛైర్మన్లు, అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వీరిలో టీటీడీ మాజీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఏఈఓ ధర్మారెడ్డి, గతంలో టీటీడీ బోర్డు ఛైర్మన్లుగా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు.

కొనుగోలు నిబంధనలను సడలించడం వల్లే నాసిరకం నెయ్యి సరఫరా జరిగిందనేది భానుప్రకాష్ రెడ్డి ఆరోపణ. ఏకసభ్య కమిషన్ నివేదికలోని అన్ని అంశాలపై బోర్డు చర్చించి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తీర్మానాన్ని పరిశీలిస్తుందని ఆయన తెలిపారు. లడ్డూ ప్రసాదం తయారీలో నాణ్యత ప్రమాణాలను పకడ్బందీగా పాటించడంపై కూడా ఈ సమావేశంలో వివరణాత్మక చర్చ జరిగే అవకాశం ఉంది.
కమిటీ నివేదికతో పాటు, టీటీడీ బోర్డు ఇతర ముఖ్యమైనా అంశాలను కూడా చర్చించనుంది. భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తిరుమలలో వారికి సౌకర్యాలను మెరుగుపరచడం, మౌలిక వసతులను పటిష్టం చేయడం వంటి చర్యలపై చర్చించనున్నారు. అలాగే తిరుమల ఆలయం చుట్టూ ఉన్న నాలుగు మాడవీధులకు నాలుగు వేదాల పేర్లు పెట్టాలనే ప్రతిపాదన కూడా పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది.
అన్నమయ్య, రామదాసు, పురందరదాస, తరిగొండ వెంగమాంబ వంటి వాగ్గేయకారుల పేర్లతో పాటు, తిరుమల నంబి, అనంతాళ్వార్ వంటి ఆలయ సేవకుల పేర్లను తిరుమలలోని ఇతర వీధులకు పెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ముల్లగుంట, ఆర్‌బిసి సెంటర్, మేదరమిట్ట వంటి ప్రాంతాలకు పుణ్యాత్మకుల పేర్లు పెట్టడాన్ని కూడా టీటీడీ ట్రస్ట్ బోర్డు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. తిరుపతిలోని అలిపిరి వద్ద ఒక టౌన్‌షిప్ అభివృద్ధి, భక్తుల వసతి సౌకర్యాలను మెరుగుపరచడానికి తిరుమలలోని కల్యాణి సత్రం ఆధునీకరణ వంటి ఇతర ప్రతిపాదనలు కూడా ఎజెండాలో ఉన్నాయి.












Click it and Unblock the Notifications