Baruipur: అడ్డంగా బుక్కయిన సీఎం సువేందు..! మమత మార్క్ పాలిటిక్స్ తో విలవిల..! 

పశ్చిమ బెంగాల్‌లోని బరుయిపూర్‌ (Baruipur)లో 12 ఏళ్ల బాలిక దారుణ అత్యాచారం, హత్య సంఘటన రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ ఏడాది మేలో ఎన్నికల్లో గెలుపొంది అధికారం చేపట్టిన సువేదు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇది మొదటి పెద్ద సవాలుగా మారింది. ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ను ఓడించడమే కాదు, చీలికలతో పూర్తిగా నిర్వీర్యం చేసేస్తున్నామని సంబరపడిన బీజేపీకి ఇప్పుడు.. ఈ రేప్, హత్య ఘటన షాకులిస్తోంది. అదే సమయంలో మమతా బెనర్జీకి మళ్లీ పుంజుకునేందుకు అత్యంత తక్కువ సమయంలోనే కొత్త అవకాశం కల్పించింది.

జులై 4న సాయంత్రం 4.30 గంటల సమయంలో స్నేహితురాలి పుట్టినరోజు బహుమతి కొనేందుకు ఇంటి నుంచి బయలుదేరిన ఆ చిన్నారి తిరిగి రాకపోవడంతో కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు సకాలంలో చర్యలు తీసుకోలేదు. దీంతో తామే సీసీటీవీ ఫుటేజ్ చూసి దర్యాప్తు చేపట్టి, నీటిలో ముంచి చంపిన దారుణాన్ని బయటపెట్టారు. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం, ఆ బాలికను అత్యాచారం చేసి, కొట్టి, కాటేసి తలపై బలమైన వస్తువుతో కొట్టి, ఇప్పటికీ ప్రాణాలున్నప్పుడే గన్నీ బ్యాగ్‌లో పెట్టి కొలనులో విసిరారు. ఊపిరితిత్తులు, కడుపులో నీరు ఉండటం దీనిని నిరూపిస్తోంది. ఈ విషయాలు వెలుగులోకి రాగానే బరుయిపూర్ ఆగ్రహంతో రగిలిపోతోంది.

ఈ వ్యవహారంలో పోలీసుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. ముఖ్య నిందితుడు ఆనంద సర్దార్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించినా, అతడు రహస్యంగా పోలీసు క్యాంపు నుంచి తప్పించుకున్నాడు. బీజేపీ నేత శాంతను మండల్ ఒక నిందితుడికి సహాయం చేశాడని, అతని ఇంటిని కోపంతో స్ధానికులు ధ్వంసం చేశారు. అయితే మండల్ ఇది అబద్ధమని, పోలీసులకు సహకరించడానికే ప్రయత్నించానని అతని చెప్తున్నాడు. ఈ ఘటనతో ఆగ్రహం మరింత పెరిగి, ఇంద్రజిత్ తంతి (26) అనే వ్యక్తిని ప్రజలు గుంపుగా చంపేశారు. సీఎం సువేదు అధికారి దీనిని సామాజిక కోణం ఉన్న హత్యగా అభివర్ణించి, హింసకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధాన నిందితుడు ఆనంద్ సర్దార్‌తో సహా ముగ్గురిని తాజాగా అరెస్టు చేశారు. నాలుగో వ్యక్తి పరారీలో ఉన్నాడు.

ఈ ఘటనను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాలిఘాట్ నివాసం వద్ద పోలీసులు అడ్డంకులు ఏర్పాటు చేయడంతో తనను ఇంటి నిర్బంధంలో ఉంచారని ఆమె ఆరోపించారు. తనను ఎందుకు బయటకు వెళ్లనివ్వడం లేదని, తాను అంత ప్రమాదం ఎందుకని మమత ప్రశ్నిస్తున్నారు. బీజేపీ మాత్రం ఇది జడ్ ప్లస్ సెక్యూరిటీకి సంబంధించిన రొటీన్ ఏర్పాట్లు మాత్రమేనని, తృణమూల్ వివాదం సృష్టించాలని చూస్తోందని తిప్పికొట్టింది. మమత నేతృత్వంలోని టీఎంసీ బృందం బాధిత కుటుంబాన్ని కలిసి, సువేదు బరుయిపూర్‌కు రాకపోవడాన్ని మణిపూర్‌తో పోల్చి విమర్శిస్తోంది. దీంతో ఇప్పటికే బలహీనపడిన తృణమూల్‌కు ఈ ఘటన బలం పుంజుకునే అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో సువేందు ప్రభుత్వం త్వరిత, న్యాయమైన దర్యాప్తు చేపట్టి, వీధుల్లో ఉద్యమించే మమతా రాజకీయాలను ఎలా నియంత్రించాలనేది ఇప్పుడు ప్రధాన సవాలు. కేవలం నిందితులను శిక్షించడం మాత్రమే కాకుండా, పోలీసు వ్యవస్థపై ప్రజల విశ్వాసం పునరుద్ధరించడం కూడా కొత్త ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం.

English Summary

A 12-year-old girl's brutal rape and murder in Baruipur, West Bengal, has triggered a severe political crisis. The tragedy highlights allegations of police negligence and has ignited a fierce battle between the BJP government and opposition leader Mamata Banerjee, putting the state’s law and order situation under intense scrutiny.