Cockroach Janta Party: కాక్రోచ్ పార్టీ నెక్స్ట్ ఉద్యమం ఇదే-అజెండా ప్రకటన..!

నీట్ అక్రమాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో మొదలుపెట్టి జాతీయ స్ధాయిలో ఒక్కసారిగా సంచలనం రేపిన కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party).. విద్యార్ధుల అండతో దాన్ని సాధించుకుంది. ఇప్పుడు తర్వాతి దశ ఉద్యమంపై రెండు రోజులుగా మహారాష్ట్రలోని శంభాజీనగర్ లో వర్క్ షాప్ నిర్వహించిన సీజేపీ నేతలు ఇవాళ కీలక ప్రకటనలు చేశారు. ఇకపై దేశవ్యాప్తంగా ప్రజలతో నేరుగా మమేకమయ్యే లక్ష్యంతో 'క్యా బోల్తీ పబ్లిక్' పేరుతో భారీ కార్యక్రమం చేపట్టబోతున్నారు.

Advertisement
వాహనదారులకు సుప్రీం భారీ షాక్- ఇన్సూరెన్స్ ఉంటేనే పెట్రోల్-కొత్త రూల్స్ ఇవే..!
Advertisement

సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే ఈ ప్రచారం ద్వారా దేశవ్యాప్తంగా పర్యటించి యువత, విద్యార్థులు, సాధారణ ప్రజల సమస్యలు, ఆశయాలు, అభిప్రాయాలను నేరుగా తెలుసుకుంటామని సీజేపీ నేతలు అభిజీత్ దిప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంగా ప్రకటించారు. తమ పార్టీ సిద్ధాంతం రాజ్యాంగ విలువల ఆధారంగా ఉంటుందని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక న్యాయం, మహాత్మా గాంధీ అహింస, జవహర్‌లాల్ నెహ్రూ ఆధునిక భారత దృక్పథమే తమకు మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ రాజకీయాలు ప్రజల సమస్యల నుంచి దూరమయ్యాయని, ముఖ్యంగా విద్య, నిరుద్యోగం వంటి అంశాలు చర్చకు రావడం లేదని నేతలు తెలిపారు.

Advertisement

పీకే విజయం వెనుక కీలక కారణాలు- కాక్రోచ్ పోరు టూ కులాల లెక్కల గల్లంతు వరకూ.!

ఈ నేపథ్యంలో విద్యా సంస్కరణలే తమ తొలి ప్రాధాన్యత అని ప్రకటించిన సీజేపీ నేతలు.. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో పెరుగుతున్న ఫీజులు, విరాళాల విధానం కారణంగా విద్య సామాన్య కుటుంబాలకు అందని ద్రాక్షగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, విద్యను వ్యాపారంగా కాకుండా మౌలిక హక్కుగా చూడాలని వారు డిమాండ్ చేశారు. అదే సమయంలో ఎన్నికల వ్యవస్థ, న్యాయవ్యవస్థ, మీడియా వంటి సంస్థలపై ప్రజల్లో నమ్మకం తగ్గుతోందని తెలిపారు. అలాగే సంస్థాగత జవాబుదారీతనం కూడా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల స్వరం వినిపించే వేదికగా తాము పనిచేస్తామని, రాజకీయ పార్టీగా కాకుండా ప్రజా ఒత్తిడి బృందం రూపంలో తాము ఇకపై కొనసాగుతామని స్పష్టం చేశారు. అలాగే దేశవ్యాప్తంగా సీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. విద్యార్థులు, యువత, ఉద్యోగులు, సామాన్య పౌరులు తమ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం పార్టీ ఎలాంటి విరాళాలు లేదా క్రౌడ్‌ఫండింగ్ స్వీకరించడం లేదని, ప్రజలు మోసపూరిత ఫండింగ్ కార్యక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరించారు.