బెంగాల్లో అధికారం కోల్పోయాక తృణమూల్ కాంగ్రెస్ లో సంక్షోభం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఇప్పటికే ఎంపీలు, ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా చీలిపోయారు. అసంతృప్తులు వేరు కుంపట్లు పెట్టుకున్నారు. ఇప్పుడు పార్టీలో మిగిలిన నేతలు సైతం వారి దగ్గరికి వెళ్లిపోతున్నారు. ఇదే క్రమంలో ఇవాళ పశ్చిమబెంగాల్ టీఎంసీ అధ్యక్షురాలిగా ఉన్న చంద్రిమా భట్టాచార్య కూడా ఇవాళ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీలో అన్ని పదవులకూ రాజీనామా చేసేసి రెబెల్ క్యాంపులో చేరిపోయారు. ఈ వ్యవహారంపై అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) వెంటనే స్పందించారు.
చంద్రిమా భట్టాచార్య వదిలిపెట్టిన టీఎంసీ రాష్ట్ర అధ్యక్షురాలి పదవినీ తానే ఇకపై నిర్వహిస్తానని మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ చైర్‌పర్సన్‌గా.. ఈ రోజు నుండి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర టీఎంసీ అధ్యక్షురాలి బాధ్యతలను కూడా నేనే స్వీకరిస్తున్నానని ప్రకటిస్తున్నానని మమత తెలిపారు. అలాగే పార్టీ సీనియర్ నేతలు మదన్ మిత్ర, కునాల్ ఘోష్ ఇద్దరినీ పార్టీ కమిటీలోకి తీసుకున్నామని మమత వెల్లడించారు. వీరిద్దరినీ టీఎంసీ రాష్ట్ర కమిటీకి ప్రధాన కార్యదర్శులుగా నియమించినట్లు దీదీ పేర్కొన్నారు.
బెంగాల్లో వరుసగా మూడుసార్లు ప్రభుత్వాలు నడిపి, ఓ దశలో దేశంలోనే బీజేపీకి దీటైన నాయకురాలిగా ఎదిగిన మమతా బెనర్జీ.. తాజాగా రాష్ట్రంలో అధికారం కోల్పోయాక మాత్రం ఒక్కసారిగా బలహీనపడటం ప్రారంభమైంది. ముఖ్యంగా భవానీపూర్ లో తాను గెలిచే పరిస్దితి ఉన్నా చివరి నిమిషంలో చోటు చేసుకున్న పరిణామాల్లో ప్రత్యర్ధుల దాడికి గురై ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. అక్కడి నుంచీ మమత పార్టీ పతనం కూడా ప్రారంభమైంది. ఆ తర్వాత మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై బీజేపీ శ్రేణుల దాడి, టీఎంసీ నేతలపైనా దాడులు పెరిగాయి. అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు రెబెల్స్ గా మారి ఇప్పుడు పార్టీని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మమత టీఎంసీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కూడా చూస్తానని ప్రకటించడం సంచలనం రేపుతోంది.