నీట్ వివాదంపై మౌనం ఎందుకంటే ?- రాఘవ్ చద్దా షాకింగ్ కామెంట్స్..!

ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీగా ఉంటూ రాఘవ్ చద్దా (Raghav Chadha)పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నలు ఆయన్ను సామాన్యుల ఎంపీగా పేరు తెచ్చిపెట్టాయి. సామాన్యులు ఎదుర్కొంటున్న 28 రోజుల మొబైల్ రీఛార్జ్ వంటి ఎవరూ పట్టించుకోని అంశాలపై రాఘవ్ చద్దా అడిగిన ప్రశ్నలు చాలా ప్రాచుర్యం పొందాయి. అయితే సడన్ గా ఉన్నట్లుండి ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరిపోయిన రాఘవ్ చద్దా ఒక్కసారిగా తన ఫాలోయర్లను సగానికి సగం కోల్పోయారు. ఇప్పుడు నీట్ పేపర్ లీక్ దేశాన్ని కుదిపేస్తున్నా బీజేపీ ఎంపీగా ఉన్న ఆయన నోరు విప్పకుండా మౌనంగా ఉండిపోవడం చర్చనీయాంశమవుతోంది.

Advertisement
Abhijeet Dipke: బీజేపీలో చేరకపోతే బెదిరింపులా? ప్రహ్లాద్ జోషీ, రాందేవ్ పైనా అభిజీత్ దిప్కే అటాక్..!
Advertisement

ఈ నేపథ్యంలో తాజాగా రాజ్యసభలో కేంద్రం తెచ్చిన పేపర్ లీక్ నిరోధక బిల్లుపై మాత్రం రాఘవ్ చద్దా మాట్లాడారు. ఇన్నాళ్లూ తాను నీట్ పేపర్ లీక్ పై ఎందుకు మాట్లాడటం లేదో కూడా ఆయన తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. గతంలో తాను విపక్షంలో ఉంటూ ప్రజల ప్రశ్నలు అడిగేవాడినని, కానీ ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నాను కాబట్టి వాటికి పరిష్కారాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చద్దా చెప్పుకొచ్చారు. దీంతో పార్టీలు మారితే ఇలా కూడా జరుగుతుందా అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.

కాక్రోచ్ సక్సెస్ తో తెరపైకి మరో ఉద్యమం..! ఇన్ స్టా లో మిలియన్ల సపోర్ట్..!
Advertisement

ఇలాంటి సంఘటనలను మీడియా ప్రకటనలతో పరిష్కరించలేమని, దీనికి వ్యవస్థాగత పరిష్కారం అవసరమని రాఘవ్ చద్దా తెలిపారు. ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి మారిన తర్వాత తన పాత్ర మారిందని, ఇప్పుడు తన దృష్టి పరిష్కారాలు కనుగొనడంపైనే ఉందని చెప్పుకొచ్చారు. తనకు హెడ్ లైన్ లలో ఉండటం గానీ, కెమెరాల ముందు మాట్లాడి హాజరు నమోదు చేసుకోవడం గానీ అవసరం లేదని, కేవలం ఫలితమే ముఖ్యమని చద్దా పేర్కొన్నారు. ఒక పరిష్కారం తీసుకురాగలిగినప్పుడు, వ్యవస్థను సరిదిద్దినప్పుడు మాత్రమే పార్లమెంటులో ఈ విషయం గురించి మాట్లాడతానని తనకు తాను వాగ్దానం చేసుకున్నానని వెల్లడించారు. వ్యవస్థను సరిదిద్దుతున్న ఆ చారిత్రాత్మక రోజు ఈరోజే అన్నారు. విద్యార్థుల నిరాశ సమర్థనీయమైనదేనని, నీట్ పరీక్ష రాసే అభ్యర్థికి ఇది మరింత కష్టమని చద్దా అంగీకరించారు.