జడ్జికే తీర్పు ఆదేశాలు ఇచ్చిన పిటిషనర్-సుప్రీంలో షాకింగ్ ఘటన..!

దేశ అత్యున్నత న్యాయస్ధానమైన సుప్రీంకోర్టు (Supreme Court) లో ఇవాళ ఓ సంచలన ఘటన చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు విచారణకు హాజరైన ఓ పిటిషనర్ కోర్టు హాల్లో తన ప్రవర్తనతో కలకలం సృష్టించాడు. ఏకంగా న్యాయమూర్తులు కూర్చునే బెంచ్ పైకి పేపర్లు విసరడమే కాకుండా, ఛీఫ్ జస్టిస్ పైనే తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దీంతో కోర్టు గదిలో ఉద్రిక్త పరిస్దితులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వెంటనే జోక్యం చేసుకున్న న్యాయమూర్తి పోలీసుల సాయంతో అతన్ని బయటికి పంపారు.

Advertisement

యూపీలోని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఓ తీర్పును సవాల్ చేస్తూ పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ విచారణకు స్వయంగా హాజరైన ఒక ఫిర్యాదు దారుడు, ఉన్నట్లుండి ధర్మాసనం వైపు పేపర్లు విసిరి, ప్రధాన న్యాయమూర్తిపైనే దుర్భాషలకు దిగాడు. భద్రతా సిబ్బంది అతడిని వెంటనే కోర్టు గది నుండి బయటకు తీసుకువెళ్లారు.
జస్టిస్‌లు కె.వి. విశ్వనాథన్, అలోక్ అరధేలతో కూడిన ధర్మాసనం ముందు ఈ ఘటన చోటు చేసుకుంది.

Advertisement

సదరు పిటిషనర్.. విచారణ ప్రారంభమైన తర్వాత.. న్యాయమూర్తుల్ని ఉద్దేశించి.. గౌరవనీయ న్యాయాధికారి గారూ. లక్నో ఏసీపీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించాలని నేను మిమ్మల్ని ఆదేశిస్తున్నాను అన్నాడు. ఈ వ్యాఖ్యకు ఆశ్చర్యపోయిన జస్టిస్ విశ్వనాథన్.. "నన్ను ఆదేశిస్తున్నారా? మమ్మల్ని ఆదేశిస్తున్నారా?" అని అడిగారు. దీనికి ఫిర్యాదిదారుడు.. నా వైపు నుండి ఇంతే. అంతా రికార్డులో ఉంది అని న్యాయమూర్తి తరహాలో వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే పిటిషనర్ తన కేసు పత్రాలను గాలిలోకి విసిరి, ప్రధాన న్యాయమూర్తిని దూషించడంతో ఘర్షణ తీవ్రమైంది. ఛీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అక్కడ లేకపోయినా ఆయనపై తీవ్ర విమర్శలు చేశాడు. చివరికి సెక్యూరిటీ సిబ్బంది అతన్ని బయటికి లాక్కెళ్లిపోయారు.