అందుకే అన్నాడీఎంకేను చీల్చేస్తున్న విజయ్ ? గుట్టు బయటపెట్టిన మాజీ స్పీకర్..!  

తమిళనాడు (Tami Nadu) రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రాంతీయ పార్టీల మధ్య అంతర్గత విభేదాలు, ఆరోపణలు తీవ్రరూపం దాల్చాయి. ముఖ్యంగా నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే), ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే (AIADMK)ల మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ ఇప్పుడు బహిరంగ చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో తమిళనాడు మాజీ స్పీకర్ అప్పావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Advertisement

అన్నాడీఎంకే మద్దతు కోరిన విజయ్ (Tamil Nadu)

ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు రాత్రి అన్నాడీఎంకే మద్దతును టీవీకే కోరిందని అప్పావు వెల్లడించారు. అయితే అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి కొన్ని కఠినమైన షరతులు విధించడంతో ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదని చెప్పారు. తమ ప్రతిపాదనలను తిరస్కరించడంతో ఆగ్రహానికి గురైన టీవీకే అధినాయకత్వం, అన్నాడీఎంకేను చీల్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని ఆయన ఆరోపించారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఏకంగా తమ పార్టీలోకి చేర్చుకునేలా హార్స్ ట్రేడింగ్‌కు పాల్పడుతోందని విమర్శించారు.

Advertisement

డీఎంకే విమర్శల దాడి

మరోవైపు విజయ్ (Vijay) నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత బలహీనమైనదని డీఎంకే మాజీ ఎమ్మెల్యే పరంధామన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది 150 లేదా 160 స్థానాల భారీ మెజారిటీతో ఏర్పడిన బలమైన ప్రభుత్వం కాదని, కేవలం 108 స్థానాలు సాధించిన మైనారిటీ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. కోర్టు ఆదేశాలు, ఒక నియోజకవర్గ సభ్యత్వ రద్దు వంటి పరిణామాల కారణంగా ప్రస్తుతం అసెంబ్లీలో ప్రభుత్వ బలం మరింత తగ్గిపోయిందని ఆయన గుర్తు చేశారు. చిన్న గాలి వీస్తే కుప్పకూలిపోయే పేకమేడ లాంటి ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి డీఎంకే కుట్ర చేస్తోందంటూ టీవీకే నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పరంధామన్ మండిపడ్డారు. కేవలం 105 మంది శాసనసభ్యుల మద్దతుతో నడుస్తున్న విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోయే ప్రమాదం ఉందనే విషయం సామాన్యులకు కూడా తెలుసన్నారు. తమ స్వంత బలహీనతలను కప్పిపుచ్చుకోవడానికే నిత్యం డీఎంకే ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని ఆరోపించారు.

Advertisement

రసవత్తరంగా తమిళ రాజకీయం

తమిళనాడులో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తున్నాయి. అన్నాడీఎంకేను బలహీనపరిచేందుకు టీవీకే ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు ఒకవైపు, మైనారిటీ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు విజయ్ పడుతున్న శ్రమ మరోవైపు రాజకీయాలను వేడెక్కించాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య సాగుతున్న ఈ ఆరోపణల పర్వం రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మలుపులు తిరుగుతుందో చూడాలి.

English Summary

Tamil Nadu politics faces a fresh wave of turmoil as intense disagreements emerge between the TVK and ADMK. Allegations of strategic horse-trading and criticisms regarding the strength of Vijay’s minority government have escalated tensions. As major political players trade barbs, the public awaits the next major shift in this unfolding state political drama.