Weak Monsoon: బలహీన రుతుపవనాలతో ధరల మంట ? అంతర్జాతీయ రేటింగ్ సంస్ధ అంచనా..!

ఎల్ నినోతో పాటు ఇతర కారణాల వల్ల భారత్ లో రుతుపవనాల మందగమనం (Weak Monsoon) కొనసాగుతోంది. ఎక్కడి రుతుపవనాలు అక్కడే ఉండిపోతున్నాయి. తాజాగా మహారాష్ట్రతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం రుతుపవనాల ప్రభావం తీవ్రంగా పడటంతో అతివృష్టి నెలకొంది. కానీ దేశంలోని ఇతర ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ అనావృష్టి కొనసాగుతోంది. దీని ప్రభావం వచ్చే ఆర్ధిక సంవత్సరంపై తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ధరలు భారీగా పెరిగే ప్రమాదం పొంచి ఉంది.

Advertisement

దేశంలో రుతుపవనాల ప్రభావం బలహీనంగా ఉంటే ద్రవ్యోల్బణం పెరగడం, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ తగ్గడం, ఆర్థిక సమతుల్యతపై ఒత్తిడి పడటం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ తాజాగా పేర్కొంది. తక్కువ వర్షపాతం, వ్యవసాయ ఉత్పాదక వ్యయాలు పెరగడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రెట్టింపు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ సంస్థ హెచ్చరించింది. వాతావరణ విభాగం అంచనాల ప్రకారం ఈసారి నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే చాలా బలహీనంగా ఉండే అవకాశం ఉందని, వర్షపాతం దీర్ఘకాలిక సగటులో సుమారు 90 శాతానికి పరిమితం కావచ్చని ఎస్ అండ్ పీ పేర్కొంది.

Advertisement

బలహీనమైన రుతుపవనాలు ద్రవ్యోల్బణం గణనీయంగా పెరగడానికి దారితీస్తాయని, వ్యవసాయ ఉత్పత్తిలో అంతరాయాలు తక్షణమే ఆహార ధరలపై ప్రభావం చూపుతాయని హెచ్చరించింది. దేశంలో వినియోగదారుల ధరల సూచీలో ఆహార పదార్థాల వాటా మూడింట ఒక వంతు కంటే ఎక్కువగా ఉంది. మే నెలలో నమోదైన 3.9 శాతం వార్షిక ద్రవ్యోల్బణ రేటుతో పోలిస్తే, వ్యవసాయ రంగంపై పడే ఈ ప్రతికూల ప్రభావం, అలాగే ఆహారం, ఇంధన ధరల పెరుగుదల కారణంగా 2026-27 ఆర్థిక సంవత్సరంలో (FY27) ద్రవ్యోల్బణం 5.1 శాతానికి చేరుకుంటుందని అంచనా వేస్తోంది.

Advertisement

మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కొంత కఠినమైన విధాన వైఖరిని కొనసాగిస్తుందని కూడా అంచనా వేశారు. ఇది ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపవచ్చని అంచనా. దీర్ఘకాలం పాటు వర్షాలు లేకపోవడం వల్ల ఎరువులు, ఆహార సబ్సిడీలను పెంచడం, అలాగే గ్రామీణ ఉపాధి పథకాలను విస్తరించడం వంటి భారీ ఆర్థిక సహాయ చర్యలు అవసరం కావచ్చని, తద్వారా ఆర్థిక క్రమశిక్షణ ప్రణాళికలకు ఆటంకం కలగవచ్చని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ పేర్కొంది. అయితే ప్రభుత్వ ఆహార ధాన్యాల నిల్వలు, పంపిణీ వ్యవస్థ, గ్రామీణ ఉపాధి పథకాలు ఈ పరిస్థితి ప్రభావాన్ని కొంతవరకు తగ్గిస్తాయని తెలిపింది. ఆర్థిక వ్యవస్థలో వచ్చిన నిర్మాణాత్మక మార్పులు కూడా ఇందుకు దోహదపడతాయి. గ్రామీణ ప్రాంతాల్లో రుణాల డిమాండ్ తగ్గవచ్చని, వ్యవసాయ అనుబంధ రుణాల విషయంలో ఆస్తుల నాణ్యత స్వల్పంగా క్షీణించవచ్చని అంచనా వేశారు.