WhatsApp Username కు అప్పుడే కేంద్రం షాక్..! కొత్త అనుమానాలు..!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తాజాగా వినియోగదారుల కోసం యూజర్ నేమ్ (WhatsApp Username) ఫీచర్ ను తీసుకొస్తోంది. ఇప్పటివరకూ వాట్సాప్ యూజర్లను వారి ఫోన్ నంబర్ల ఆధారంగా గుర్తిస్తుండగా.. ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా యూజర్ నేమ్ ద్వారా గుర్తించేలా ఈ ఫీచర్ పనిచేయబోతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే వినియోగదారులకు తమ యూజర్ నేమ్ లను రిజర్వ్ చేసుకోవాలని కోరుతూ వాట్సాప్ మెసేజ్ లు సైతం పంపుతోంది. దీంతో భారీ ఎత్తున యూజర్లు తమ యూజర్ నేమ్ లు రిజర్వ్ చేసుకుంటున్నారు.

Advertisement

అయితే ఇప్పుడు కేంద్రం దీనిపై అనుమానం వ్యక్తం చేస్తోంది. మెటా తీసుకొస్తున్న ఈ యూజర్ నేమ్ ఫీచర్ అక్రమార్కులకు వరంగా మారుతుందని అనుమానిస్తోంది. దీంతో త్వరలో మెటాకు నోటీసులు పంపేందుకు సిద్దమవుతోంది. ఈ ఫీచర్ వినియోగదారులకు వారి గోప్యతపై మరింత నియంత్రణను ఇచ్చేలా రూపొందించబడినప్పటికీ, ఆన్ లైన్ మోసాలు, వినియోగదారుల భద్రత కోణం నుండి కేంద్రం ఈ కొత్త వ్యవస్థను నిశితంగా పరిశీలించాలని భావిస్తోంది.

Advertisement

కేంద్రం సమీక్ష సమయంలో ఏవైనా అక్రమాల్ని గుర్తిస్తే వాట్సాప్‌కు యజమాని అయిన మెటా కంపెనీకి ప్రభుత్వం నోటీసు కూడా జారీ చేయవచ్చని తెలుస్తోంది. దేశంలో ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న తరుణంలో కేంద్రం ఈ చర్య తీసుకుంది. మోసగాళ్లు అమాయక వినియోగదారులను లక్ష్యంగా చేసుకోవడానికి మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లను వాడుతున్నారు. యూజర్‌నేమ్ ఆధారిత ఈ వ్యవస్థ మోసగాళ్లను గుర్తించడంలో కొత్త సవాళ్లను సృష్టిస్తుందా, లేదా భద్రతకు భంగం కలగకుండా వినియోగదారుల గోప్యతను బలోపేతం చేస్తుందా అనే విషయాన్ని అధికారులు అధ్యయనం చేసే అవకాశం ఉంది.