రేపటి నుంచే బోనాలు.. వారికి పోలీసులు కీలక వార్నింగ్..


తెలంగాణలో బోనాల పండగకు వేళ అయింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బోనాల పండగ నిలుస్తూ వస్తోంది. రేపటినుంచి అంటే జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు బోనాల పండగ ఘనంగా జరగనుంది. హైదరాబాద్- సికింద్రాబాద్ జంట నగరాల్లో బోనాల ఉత్సవాలు జరుగనున్న నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు ఆలయాలకు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అధికారులను ఆదేశించారు. ఈ పండుగను భక్తులు అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో జరుపుకొనేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు.

Advertisement

గోల్కొండ, బల్కంపేట, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ తదితర ఆలయాల్లో జరిగే బోనాల ఉత్సవాల బందోబస్తు ఏర్పాట్లపై తాజాగా వీసీ సజ్జనార్ సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న భద్రతా చర్యలను ఈ సందర్భంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో మాట్లాడుతూ.. గోల్కొండ బోనాలతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో భాగంగా రాబోయే 15 రోజులు అత్యంత కీలకమని గుర్తు చేశారు. ఆయా ఆలయాల వద్ద భక్తుల రద్దీకి అనుగుణంగా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement
Bonalu Festival 2026: భాగ్యనగరంలో బోనాల జాతర షెడ్యూల్ వచ్చేసింది

పండగ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టాస్క్ ఫోర్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిటీ ఆర్మ్డ్ రిజర్వ్, క్విక్ రియాక్షన్ టీమ్స్ తో పాటు స్థానిక పోలీసులను భారీగా మోహరిస్తున్నట్లు వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు భక్తులకు అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా ఆలయాల పరిసరాల్లో పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని తెలిపారు.

బోనాల పండగకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివస్తారని వారి భద్రతకు హైదరాబాద్ సిటీ పోలీస్ అత్యంత ప్రాధాన్యమిస్తుందని స్పష్టం చేశారు. గొలుసు దొంగతనాలు, మొబైల్ స్నాచింగ్, జేబు దొంగతనాలు, ఈవ్ టీజింగ్ వంటి నేరాలకు ఆస్కారం లేకుండా నివారణా చర్యలు చేపట్టాలని సూచనలు చేశారు. అలాగే ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.