హైదరాబాద్‌లో బోనాల సందడి - ముహూర్తం, షెడ్యూల్..!!

భాగ్యనగరంలో బోనాల ఉత్సవాల సందడి మొదలు కానుంది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదా యాలకు నిలువెత్తు రూపంగా నిలిచే హైదరాబాద్ ఆషాఢ బోనాల ఉత్సవాల నిర్వహణకు రంగం సిద్దమైంది. ఇందుకు ముహూర్తం ఖరారైంది. ఈ ఏడాది బోనాల జాతర జులై 16వ తేదీ నుండి ప్రారంభమై, ఆగస్టు 13వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనుంది. కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ చారిత్రాత్మక ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.

Advertisement

ఆషాఢ బోనాల జాతర పోస్టర్, బ్రోచర్‌ను మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. బోనాలు తెలంగాణ గంగా-జమున తెహజీబ్‌కు ప్రతీకగా పేర్కొన్నారు. హిందూ - ముస్లిం ఐక్యత దేశానికి ఆదర్శమని చెప్పుకొచ్చారు. గోల్కొండ బోనాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని తెలిపారు. జులై 16 నుంచి ఆగస్టు 13 వరకు బోనాల ఉత్సవాలు జరగనున్నాయని వెల్లడించారు. భక్తులు సంతృప్తిగా దర్శనం చేసుకునేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు మంత్రి కొండా సురేఖ సూచించారు. బోనాల షెడ్యూల్ ను ఖరారు చేసారు. అందులో భాగంగా జులై 16 (తొలి బోనం): జగదాంబిక అమ్మవారికి సమర్పించే తొలి బోనంతో గోల్కొండ కోటలో అధికారికంగా వేడుకలు ప్రారంభమవుతాయి.

Advertisement

అదే విధంగా జులై 19న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవానికి అంకురార్పణ జరుగుతుంది. జులై 26న నగరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. ఆగస్టు 2న (లష్కర్ బోనాలు) సికింద్ రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తారు. ఆగస్టు 9న (పాతబస్తీ బోనాలు)గా చారిత్రాత్మక లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారితో పాటు పాతబస్తీలోని అన్ని ప్రధాన ముత్యాలమ్మ, మహంకాళి ఆలయాల్లో బోనాల జాతర జరుగుతుంది. ఇక, ఆగస్టు 10 నసికింద్రాబాద్ మరియు పాతబస్తీ ఆలయాల్లో అమ్మవారి భవిష్యవాణి (రంగం) వినడం, ఆ తర్వాత ఘటాల ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని అధికారులు వెల్లడించారు.

English Summary

Bonalu festivities will be held from July 16 to August 13, announced Endowment Minister Konda Surekha.