ఉజ్జయిని మహంకాళి బోనాలు.. రెండు రోజులు వైన్స్ బంద్

సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి బోనాలకు సర్వం సిద్ధమైంది. అమ్మవారికి భక్తితో బోనం సమర్పించేందుకు భక్తులు సిద్ధమయ్యారు. ఆగస్టు 2 ఆదివారం ఉదయం 4 గంటల నుంచే దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు దాదాపు లక్ష మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక దర్శన మార్గాలు, వాలంటీర్లు, నిరంతర విద్యుత్ సరఫరా వంటి ఏర్పాట్లు పూర్తి చేశారు.

Advertisement

అటు బోనాల సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారుపోలీసులు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆగస్టు 2 నుంచి 4వ తేదీ తెల్లవారుజామున 3 గంటల వరకు ఆలయం చుట్టూ 2 కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్‌ మళ్లింపులు, ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

మరోవైపు బోనాల సందర్భంగా ఆగస్టు 2 వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 4 వ తేదీ ఉదయం 6 గంటల వరకు రెండు రోజుల పాటు వైన్స్, రెస్టారెంట్స్, బార్ లను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఈ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రెండు రోజులపాటు ఈ నిబంధనలు కఠినంగా అమల్లో ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు.

ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రేపు నిర్వహించే అమ్మవారి మహా హారతిలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండాసురేఖ పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అలాగే అమ్మవారికి 15 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తామని చివరగా బోనాలు, రంగం కార్యక్రమంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయని పండితులు స్పష్టం చేశారు.