తెలంగాణలో త్వరలో జరుగనున్న పోలీస్ రక్రూట్మెంట్ పరీక్షల నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్షను నిర్వహించారు. మొత్తం 7,437 పోలీస్ ఉద్యోగాల నియామక ప్రక్రియకు సంబంధించిన పరీక్షలు ఇవి. వీటిని పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. పోలీస్ శాఖలో కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఎటువంటి అన్యాయం జరగకుండా ఈ నియామకాలు పూర్తి కావాలని స్పష్టం చేశారు.
ఈ ప్రక్రియకు అడ్డంకులు సృష్టించడానికి కొన్ని రాజకీయ శక్తులు, స్వార్థ ప్రయోజనాలు ఆశించే గ్రూపులు ప్రయత్నిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ విభాగాల నుంచి పక్కా సమాచారం అందిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి.. ఈ సమీక్షను నిర్వహించారు. సచివాలయంలో ఈ అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటైంది. ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి వీ శేషాద్రి, పోలీస్ డైరెక్టర్ జనరల్ సీవీ ఆనంద్, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి శిఖాగోయల్, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సహా పలువురు ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు.
నీట్ పేపర్ల లీక్, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను రేవంత్ రెడ్డి పరిగణనలోకి తీసుకున్నారు. పోలీస్ ఉన్నతాధికారులకు పలు ఆదేశాలను ఇచ్చారు. పరీక్షల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. నియామక ప్రక్రియ విజయవంతంగా ముగిసేంత వరకు సైబర్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విభాగాలు డేగకన్ను వేసి ఉంచాలని చెప్పారు. ఎటువంటి లోపాలకు అవకాశం ఇవ్వకూడదని, ఈ మొత్తం రిక్రూట్మెంట్ ప్రక్రియపై నిఘా ముమ్మరం చేయాలని సూచించారు. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా సాగే ఈ ప్రక్రియలో ఎలాంటి చిన్న లోపానికి లేదా అవకతవకలకు తావులేకుండా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. పరీక్షల విశ్వసనీయతను కాపాడటం, అర్హులైన ప్రతి ఒక్క అభ్యర్థికి న్యాయం చేయడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, వివిధ ప్రాంతాలకు వాటిని సురక్షితంగా రవాణా చేయడం తదితర ప్రతి దశలోనూ అత్యంత కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద అదనపు బలగాలతో భారీ బందోబస్తును ఏర్పాటు చేయాలని, లోపల, బయటా ఎలాంటి దుశ్చర్యలు జరగకుండా బయోమెట్రిక్ విధానం, సీసీటీవీల సాయంతో నిఘా ఉంచాలని రేవంత్ రెడ్డి చెప్పారు. వివిధ ప్రైవేటు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు, కొందరు మధ్యవర్తుల అనుమానాస్పద కదలికలపై ఇంటెలిజెన్స్ విభాగం నిరంతరం నిఘా ఉంచాలని అన్నారు. సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయక అభ్యర్థులకు తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేసే దళారులు, ఫేక్ వెబ్‌సైట్లను నడిపించే ముఠాలపై సైబర్ క్రైమ్ విభాగం ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. సామాజిక మాధ్యమాల్లో పరీక్షలపై తప్పుడు ప్రచారాలు లేదా పుకార్లు వ్యాప్తి చేసే నకిలీ సోషల్ మీడియా అకౌంట్లను తక్షణమే బ్లాక్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఎల్లుండి.. అలిపిరి కపిలతీర్థం ఆలయంలో: చురుగ్గా ఏర్పాట్లు
రానున్న నెలలో తిరుమలలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలన్నీ రద్దు