తింటే ప్రాణాలు పోవాల్సిందే! స్నాక్స్ ప్యాకెట్లో బల్లి..

ప్రజలారా... హోటళ్లు, స్వీట్ హౌస్‌లలో కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్న తినుబండారాలను చూసి మోసపోకండి! పిల్లలు ఇష్టంగా తింటున్నారని మార్కెట్లో దొరికే స్నాక్స్‌ను నేరుగా వారి నోటికి అందించే ముందు ఒక్కసారి పరిశీలించండి. ఎందుకంటే, అక్కడ శుభ్రతకు పాతరేస్తున్నారు. కాసుల కక్కుర్తితో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లాను వణికించిన పానీపూరి ఘటన మరువకముందే... తాజాగా జిల్లా కేంద్రంలో వెలుగుచూసిన మరో దారుణం ఆహార భద్రతపై తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.

Advertisement

తెరచి చూస్తే షాక్.. బంధువులాంటి బల్లి!

సిరిసిల్ల పట్టణానికి చెందిన చందు అనే వినియోగదారుడు తన పిల్లల కోసం స్థానిక 'బాలాజీ స్వీట్ హౌస్' లో భూంది కార, రింగ్స్, గాటు వంటి స్నాక్స్ కొనుగోలు చేశాడు. ఎంతో ఇష్టంగా తింటారనే ఆశతో ఇంటికి తీసుకెళ్లి ఆ ప్యాకెట్లను తెరచి చూడగా ఒక్కసారిగా గుండె గుభేల్మంది. ఆ స్నాక్స్ మధ్యలో చనిపోయిన బల్లి కనిపించడంతో ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఒకవేళ గమనించకుండా ఆ విషపూరిత ఆహారాన్ని పిల్లలు తిని ఉంటే పరిస్థితి ఏంటనే ఆలోచనే వారిని వణికించింది.

Advertisement

"ఇంకో కిలో ఎక్కువ తీసుకోపో" అంటూ యజమాని నిర్లక్ష్యం!

ఆహార పదార్థాల్లో బల్లి వచ్చిన విషయాన్ని పట్టుకుని బాధితుడు చందు సదరు స్వీట్ హౌస్ యజమాని వద్దకు వెళ్లాడు. తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పాల్సింది పోయి, ఆ యజమాని బాధ్యతారాహిత్యంగా, దురుసుగా ప్రవర్తించాడు. "అయితే ఏమైంది.. ఇంకో కిలో ఎక్కువ తీసుకోపో" అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం అక్కడున్న వారిని సైతం విస్మయానికి గురిచేసింది. వ్యాపార వాణిజ్యాల కోసం ప్రజల ఆరోగ్యాలను పణంగా పెట్టడమే కాకుండా, ప్రశ్నించిన వినియోగదారులపై ఇంత అహంకారాన్ని ప్రదర్శించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

అసలు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారా.. లేరా?

వరుసగా జరుగుతున్న ఇటువంటి ఘటనలతో సిరిసిల్ల ప్రజలు హోటళ్లు, స్వీట్ స్టాళ్లలో తినుబండారాలు కొనాలంటేనే హడలిపోతున్నారు. జిల్లాలో అసలు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారా లేరా? ఉంటే వారు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారా? అనే ప్రశ్నలు ఇప్పుడు బహిరంగంగా వినిపిస్తున్నాయి. కేవలం ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేయడం కాకుండా, నిరంతరం నిఘా ఉంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

తక్షణ డిమాండ్..

ఈ బాలాజీ స్వీట్ హౌస్ ఘటనపై సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి పూర్తిస్థాయి విచారణ జరపాలి. నిబంధనలు ఉల్లంఘించి, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ, దురుసుగా ప్రవర్తించిన సదరు స్వీట్ హౌస్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే మిగతా వ్యాపారుల్లో భయం ఉంటుంది.

Advertisement

వినియోగదారులకు అలర్ట్..

బయట కొనే ఏ ఆహార పదార్థమైనా, ప్యాకెట్లనైనా పిల్లలకు ఇచ్చే ముందు పూర్తిగా తనిఖీ చేసుకోండి. ఏమాత్రం తేడా ఉన్నా ప్రశ్నించండి, అధికారుల దృష్టికి తీసుకెళ్లండి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండటమే మనకు శ్రీరామరక్ష!

English Summary

Shocking food safety negligence in Rajanna Sircilla! A dead lizard was found in a snacks packet bought from Balaji Sweet House. Locals demand strict action as the owner reportedly misbehaved when questioned.