GHMC: హైదరాబాద్ లో అందుబాటులోకి మరో భారీ ఫ్లైఓవర్: ట్రాఫిక్ జంఝాటానికి చెక్

హైదరాబాద్ లో అత్యంత రద్దీగా ఉండే రహదారుల్లో ఒకటైన నల్గొండ క్రాస్ రోడ్స్ సమీపంలో నూతన ఫ్లైఓవర్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి వీలైనంత త్వరగా ఉపశమనం కలిగించే దిశగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) తగిన చర్యలు తీసుకుంటోంది. త్వరలోనే దీన్ని ప్రారంభించడానికి సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ స్వయంగా నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు.

Advertisement

మొత్తం 690 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఫ్లైఓవర్ ఇది. చీఫ్ ఇంజినీర్, ఇతర అధికారులతో కలిసి ఫ్లైఓవర్ పొడవునా క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్దేశిత గడువులోగా వాటిని పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులన్నింటినీ రాబోయే ఆగస్టు మొదటి వారానికల్లా పూర్తిగా ముగించాలని కమిషనర్ గడువు విధించారు. వర్షాకాలం ప్రారంభమైనందున పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని అన్నారు.

Advertisement

డివైడర్లు, ట్రాఫిక్ మళ్లింపుల విషయంలో ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ స్థానికులు, వాహనదారులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా పనులను ముగించాలని ఈ సందర్భంగా కమిషనర్ సూచించారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని, ఫ్లైఓవర్‌తో పాటు కింద బీటీ రోడ్డు వేసే పనులను వేగవంతం చేయాలని అన్నారు. అక్బర్‌బాగ్ వైపు వెళ్లే అప్ రాంప్ నిర్మాణాన్ని, మిగిలి ఉన్న ఇతర కనెక్టింగ్ రాంప్‌లను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని పేర్కొన్నారు.

ఫ్లైఓవర్ నిర్మాణంతో పాటు ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. వంతెన ఇరువైపులా క్రాష్ బారియర్లు ఏర్పాటు చేయడం, రోడ్డు మార్కింగ్‌లతో పాటు రాత్రి వేళల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఆధునిక వీధి దీపాల అమరిక పనులను త్వరితగతిన పూర్తి చేయనుంది. పర్యావరణ హితంగా మార్చేందుకు ఫ్లైఓవర్ కింది భాగంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

Advertisement

అక్కడ ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో హార్టికల్చర్, ల్యాండ్‌స్కేపింగ్ పనులు వేగంగా చేపట్టాలని కమిషనర్ కర్ణన్ సూచించారు. సురక్షితమైన ప్రయాణ సౌకర్యాలు కల్పించడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించి విలువైన ప్రయాణ సమయాన్ని ఆదా చేయడమే లక్ష్యంగా ఈ ఫ్లైఓవర్ పనులను చేపట్టామని అన్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుంది. ముసారాంబాగ్, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్ వైపు వెళ్లే వాహనదారుల దశాబ్దాల కల నెరవేరినట్టవుతుంది.

English Summary

GHMC Commissioner Inspects Nalgonda Flyover Works Hyderabad, Orders Faster Completion by Early August. He Emphasizing the importance of timely completion, the Commissioner instructed the engineering teams to complete the entire project by the first week of August.