హైదరాబాద్ నడి బొడ్డున భారీ ఫ్లై ఓవర్ - కష్టాలకు చెక్, సిగ్నల్ ఫ్రీ జర్నీ...!!

హైదరాబాద్ నడి బొడ్డున కొత్త ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు డీపీఆర్ సిద్దమైంది. నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు రద్దీ మార్గంలో ఈ ఫ్లై ఓవర్ ను డిసైడ్ చేసారు. దాదాపు 1.5 కిలో మీటర్ల మేర వై ఆకారంలో ఈ ఫ్లై ఓవర్ కు రూప కల్పన చేస్తున్నారు. దీని ద్వారా నిత్యం రద్దీగా ఉండే మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడనుంది. దీనికి సంబంధించి తుది కసరత్తు కొనసాగుతోంది.

Advertisement

హైదరాబాద్ నగరంలోని కోర్ ఏరియా వై ఆకారంలో ఫ్లై ఓవర్ నిర్మాణానికి డీపీఆర్ సిద్దం అయింది. నగరంలో రద్దీగా ఉండే నాంపల్లి నుంచి లక్డీకాపూల్‌ వరకు అసెంబ్లీ వెనుక వైపు నుంచి నిర్మించ డానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.నాంపల్లి వైపు నుంచి లక్డీకాపూల్‌ వైపు వన్‌ వే ఉండేలా 1.450 కిలోమీటర్ల మేర మూడు లేన్లతో ఫ్లైఓవర్‌ను డిజైన్‌ చేస్తున్నారు. ప్రతీ రోజు అన్ని సమయాల్లోనూ ఈ మార్గంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ మార్గంలో మూడు సిగ్నల్స్‌ ఉండగా, అందులో ఒకటి ప్రీ లెఫ్ట్‌ ఉంటుంది. సిగ్నల్‌ పడినా, పడకపోయినా అన్ని రోజుల్లోనూ, వేళల్లోనూ ఇక్కడ ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పటం లేదు. ఇక, అసెంబ్లీ సమావేశాల సందర్భంలో ట్రాఫిక్‌ అంక్షలు విధిస్తే వాహనదారులకు ఇబ్బందిగా మారుతోంది.

Advertisement
పట్టాలెక్కుతున్న విశాఖ - బెంగళూరు వందేభారత్ స్లీపర్: రూట్, టైమింగ్స్ ఖరారు..!!

ట్రాఫిక్ కష్టాలకు చెక్

దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఫ్లైఓవర్‌ నిర్మించాలని ఖరారు చేసింది. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యం లో డీపీఆర్‌ను ఇప్పటికే సిద్దం చేసినట్లు తెలుస్తోంది. నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ ముందు నుంచి పబ్లిక్‌ గార్డెన్‌ మీదుగా అసెంబ్లీ వెనుక వైపు నుంచి రైల్వే లైన్‌ వెంట ఫ్లై ఓవర్‌ రానుంది. లక్డీకాపూల్‌ వద్దకు రాగానే ఫ్లై ఓవర్‌ రైల్వే లైన్‌ మీదుగా వెళ్లే విధంగా ప్లాన్ సిద్దం చేస్తున్నారు. ఈ మార్గం 1.450కిలోమీటర్ల మేర మూడు లేన్లతో వన్‌ వే ఉండేలా డిజైన్‌ చేసారు. ఇక్కడే ఫ్లైఓవర్‌ రెండుగా చీలి ఒక మార్గం మాసబ్‌ ట్యాంక్‌ వైపు గల ఫ్లైఓవర్‌కు అనుసంధానం కానుంది. ఈ మార్గాన్ని రెండు లేన్లతో దాదాపు 400మీటర్ల మేర ఉండేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇక మరో మార్గం ఖైరతాబాద్‌ వైపు రోడ్డుకు అనుసంధానం కానుంది. దీన్ని కూడా రెండు లేన్లతో వై ఆకారంలో దాదాపు 530 మీటర్ల మేర ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఈ ఫ్లై ఓవర్ రూపం దాల్చితే కోర్ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడనుంది.

English Summary

HMDA Plans To Construct Y Shaped Flyover Connecting Nampally To Khairatabad And Masab Tank Via Lakdikapul