హైదరాబాద్ లో ఇటీవలి కాలంలో యాక్సిడెంట్స్ అధికం అయ్యాయి. తాజాగా మధురా నగర్ పరిధిలోని కార్మిక నగర్ లో ఆగస్టు 2 న ఆదివారం రోజున ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి బైక్ ను ఢీ కొన్న ఘటనలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిని కారు నడుపుతున్న మైనర్ బాలుడు కారుతో ఢీ కొట్టాడు. క్షతగాత్రుల్లో ఒకరికి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం తెలిసిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న మధురా నగర్ పోలీసులు బాధితులను వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
ఈ ఘటనపై మధురానగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు బాలానగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, బైక్ ఢీ కొట్టిన ఘటనలో నాలుగేళ్ల చిన్నారి స్పాట్ లోనే మృతి చెందింది. చిన్నారి టైర్ల కింద పడడంతో శరీర భాగాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. నాలుగేళ్ల చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నిలిపింది.
నగరంలోని బాలానగర్ స్టేషన్ పరిధిలోని పద్మానగర్ ఫేజ్ 1 వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వేద శ్రీ అనే నాలుగేళ్ల చిన్నారి మేనమామతో కలిసి బైక్ పై వెళ్తుండగా వారిని ఒక్కసారిగా లారీ ఢీకొట్టింది. కిందపడిపోయిన చిన్నారిపైనుంచి లారీ బ్యాక్ టైర్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది.