Rapido Driver నిజాయితీ! 102 జ్వరం.. 8 గంటల లైవ్ లొకేషన్..

తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఒక ప్రయాణికుడు ఆటోలో పర్స్ మర్చిపోతే.. ఆ డ్రైవర్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కష్టకాలంలో తోటి మనిషికి అండగా నిలిచి, తన నిజాయితీతో హైదరాబాద్‌కే గర్వకారణంగా నిలిచాడాయన.

Advertisement

చీకటి కప్పేసిన సాయంత్రం వేళ.. 102 డిగ్రీల తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులతో నడవలేని స్థితిలో ఉన్న పర్వ్ శర్మ అనే వ్యక్తి తన భార్యతో కలిసి కొండాపూర్‌లోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది. డ్రైవింగ్ చేసే శక్తి లేకపోవడంతో ర్యాపిడో ఆటోను బుక్ చేసుకున్నారు. ఆస్పత్రికి చేరుకుని, డాక్టర్‌ను కలిసి మందులు తీసుకునే సరికి హఠాత్తుగా జేబులో పర్స్ లేకపోవడం గమనించారు. ఆ క్షణంలో ఆయనకు ప్రాణాలు పోయినంత పనైంది. జ్వరం తీవ్రత ఒకవైపు, మరోవైపు ముఖ్యమైన కార్డులు ఉన్న పర్స్ పోయిందన్న ఆందోళన ఆయనను కుంగదీసింది.

Advertisement

వెంటనే ఆలస్యం చేయకుండా తాము ప్రయాణించిన ర్యాపిడో ఆటో డ్రైవర్‌కి ఫోన్ చేశారు పర్వ్. వెనుక సీటులో ఏమైనా పర్స్ ఉందేమో చూడమని ఆరాటంతో అడిగారు. అటువైపు నుంచి వచ్చిన సమాధానం పర్వ్ కుటుంబానికి కొండంత కొండంత నిమ్మళాన్ని ఇచ్చింది. "అవును భయ్యా, మీ పర్స్ నా దగ్గరే సురక్షితంగా ఉంది. కంగారు పడకండి.. ఇంకో గంటన్నరలో నేను స్వయంగా వచ్చి మీ పర్స్ మీకు ఇచ్చేస్తాను" అంటూ ఆ ఆటో డ్రైవర్ అభయం ఇచ్చారు.

ఎనిమిది గంటల వాట్సాప్ లొకేషన్..

ఆ డ్రైవర్ పేరు నరేష్. మాట ఇవ్వడమే కాదు.. ప్రయాణికుడికి ఎలాంటి ఆందోళన ఉండకూడదని తన వాట్సాప్ లైవ్ లొకేషన్‌ను ఏకంగా 8 నుంచి 9 గంటల పాటు షేర్ చేశారు. తీవ్ర ఆందోళనలో ఉన్న పర్వ్ శర్మ, నరేష్‌కి దాదాపు 10 సార్లకు పైగా ఫోన్ చేసి విసిగించినా.. నరేష్ ఏమాత్రం అసహనం చూపలేదు. ప్రతిసారీ చాలా ఓపికగా తాను ఎక్కడున్నాడో చెప్తూ, ధైర్యం చెప్పారు. చెప్పినట్లే వచ్చి పర్స్‌లో రూపాయి కూడా తగ్గకుండా భద్రంగా చేతికి అందించారు.

Advertisement

రివార్డ్ ఇవ్వాలంటూ నెటిజన్ల కోలాహలం.. స్పందించిన సంస్థ!

ఈ ఘటనపై పర్వ్ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేస్తూ.. "నరేష్ చాలా నిజాయితీపరుడు. ర్యాపిడో సంస్థ ఆయన సేవలను గుర్తించి తగిన బోనస్ లేదా బహుమతి అందించాలి" అని కోరారు. ఈ వీడియో క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు నరేష్ నిజాయితీని కొనియాడారు. ఈ వైరల్ వీడియోపై ర్యాపిడో సంస్థ కూడా సానుకూలంగా స్పందించింది. కస్టమర్ల కోసం ప్రాణపణంగా నిలిచే ఇలాంటి డ్రైవర్లను అభినందిస్తున్నామని, పర్వ్ శర్మ పంపిన ప్రశంసలను సదరు డ్రైవర్‌కు తప్పకుండా అందజేస్తామని తెలిపింది. మానవత్వం ఇంకా బతికే ఉందనడానికి ఈ సంఘటనే సజీవ సాక్ష్యమని నగరవాసులు మురిసిపోతున్నారు.

Advertisement

English Summary

A heartwarming story from Hyderabad where a Rapido driver, Naresh, showed exemplary honesty by returning a lost wallet to a passenger suffering from a 102-degree fever, sharing his live location for hours to reassure him.