హైదరాబాద్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటైన నెహ్రూ జూలాజికల్ పార్క్ సందర్శన మరింత భారం అయింది. జూ పార్క్ ఎంట్రీ ఫీజు అమాంతం పెరిగింది. అందులో అందుబాటులో ఉండే వేర్వేరు రకాల సేవల ఛార్జీలను కూడా తెలంగాణ జూ పార్క్ అథారిటీ భారీగా పెంచింది. నేటి నుంచి నూతన రేట్లు అమలులోకి వచ్చాయి. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన జరిగిన జూ పార్కుల అథారిటీ 15వ పాలక మండలి సమావేశంలో ఈ మేరకు చార్జీల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలకు తుది ఆమోదం లభించింది.
జూ పార్క్ రోజువారీ నిర్వహణ వసతులు మెరుగుపరచడం, వన్యప్రాణుల సంరక్షణ, రోజురోజుకు పెరుగుతున్న జంతువుల ఆహార ఖర్చులు, అధునాతన మౌలిక సౌకర్యాలను కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ ధరల సవరణ చేపట్టినట్టు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. నూతనంగా సవరించిన ధరల ప్రకారం.. దేశీయ పౌరులకు జూపార్క్ ఎంట్రీ ఫీజు 100 నుండి 120 రూపాయలకు పెంచారు.
విదేశీ సందర్శకుల ఎంట్రీ ఫీజు ఏకంగా 1,000 రూపాయలుగా నిర్ణయించారు. దీనికి తోడు పర్యాటకులు ఎంతగానో ఇష్టపడే సఫారీ రైడ్స్, టాయ్ ట్రైన్, అక్వేరియం సందర్శన వంటి వివిధ రకాల ఎంటర్టైన్మెంట్ టికెట్ ధరలు కూడా భారీగా పెరిగాయి. జూపార్క్ లో వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లలు ఎక్కువగా ఉపయోగించే బ్యాటరీ వాహనాలకు వసూలు చేసే ఛార్జీలను సవరించారు. జూ ప్రాంగణంలోకి తీసుకెళ్లే కెమెరాల వినియోగానికి సంబంధించిన ఫీజులను కూడా పెంచడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇకపై సాధారణ స్టిల్ కెమెరాలను పార్క్ లోనికి తీసుకెళ్లాలంటే 500 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. సినిమా షూటింగ్స్ లేదా ప్రొఫెషనల్ వీడియోల కోసం ఉపయోగించే మూవీ కెమెరా ఫీజును ఏకంగా 10,000 రూపాయలుగా నిర్ణయించారు. ఈ భారీ పెంపు వ్లాగర్లు, ఫోటోగ్రాఫర్లకు కొంత ఆందోళన కలిగించే విషయమే. పర్యాటకులతో నిత్యం రద్దీగా ఉండే నెహ్రూ జూ పార్కులో ఈ నూతన రేట్ల పెంపు వల్ల సంవత్సరానికి సగటున 50 కోట్ల రూపాయల మేర అదనపు ఆదాయం సమకూరుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ మొత్తంతో పార్క్ నిర్వహణ, అక్కడి వన్యప్రాణుల సంరక్షణ, జూ పరిసరాల అభివృద్ధి, సందర్శకులకు మరింత మెరుగైన వసతులను కల్పించడానికి వినియోగిస్తామని జూపార్క్ అథారిటీ అధికారులు చెబుతున్నారు.బెంగళూరు, ముంబైలాగా కాకూడదనే: తెలంగాణ రోడ్ మ్యాప్.. !!
పండగ సీజన్ వేళ.. బంగారం కొనుగోలుదారులకు ఉపశమనం: అయినా