హుస్సేన్‌సాగ‌ర్ నిర్మాణాల‌పై హైడ్రా ఏం చేయబోతోంది- హైడ్రా ఆకస్మిక త‌నిఖీ

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న చారిత్రక హుస్సేన్‌సాగర్ పరివాహక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై పర్యవేక్షణ ముమ్మరమైంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం (ఎఫ్‌టీఎల్) పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న కట్టడాలపై నీటిపారుదల శాఖ నుంచి అందిన ఫిర్యాదుతో ఉన్నతాధికారుల బృందం ఉమ్మడిగా రంగంలోకి దిగింది. సోమవారం నాడు ముగ్గురు అధికారులు స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణ స్థలాలను పరిశీలించింది. చెరువులు, ఇతర జలవనరుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా నేతృత్వంలో ఈ స్థాయిలో ఉమ్మడి తనిఖీలు చేపట్టడం ప్రభుత్వ కఠిన వైఖరిని స్పష్టం చేస్తోంది.

Advertisement

ఈ తనిఖీలకు ముఖ్య కారణం.. నీటిపారుదల శాఖ అధికారుల నుంచి అందిన రాతపూర్వక ఫిర్యాదు. హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ అనే సంస్థ భారీ భవన నిర్మాణం చేపడుతోందని, ఈ ప్రాజెక్టుకు తమ శాఖ నుంచి ఎటువంటి ఎన్ఓసీ లేదా అనుమతులు తీసుకోలేదని ఇరిగేషన్ అధికారులు నిర్ధారించారు. దీనిపై హైడ్రాకు సమాచారం ఇచ్చారు. నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

దీంతో హైడ్రా అధికారులు ఈ ఉమ్మడి తనిఖీలను చేపట్టారు. నిర్మాణ స్థలానికి సంబంధించిన సరిహద్దు గుర్తుు, ఇరిగేషన్ మ్యాపులను నిశితంగా పరిశీలించారు. ఎఫ్‌టీఎల్ ముంపు పరిధి ఎంతవరకు ఉంది, నిర్మాణ సంస్థ వేసిన పునాదులు ఏ హద్దుల్లో ఉన్నాయి అనే అంశాలపై రెవెన్యూ అధికారుల సాయంతో ప్రాథమిక క్రోడీకరణ చేశారు. అనుమతులు లేని పక్షంలో నిర్మాణాలను ఉపేక్షించే ప్రశ్నే లేదని తేల్చిచెప్పారు.

Advertisement

భవన నిర్మాణానికి సంబంధించిన అనుమతుల పత్రాలు, జీహెచ్‌ఎంసీ జారీ చేసిన ప్లాన్ వివరాలు, అలాగే ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ రికార్డులను క్షుణ్ణంగా సరిపోల్చాలని కమిషనర్లు ఆదేశించారు. చట్టపరమైన నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే తదుపరి చర్యలు చాలా కఠినంగా ఉంటాయని ఈ సందర్భంగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఈ ఉమ్మడి తనిఖీలతో అక్రమ కట్టడదారుల్లో ఆందోళన మొదలైంది.

ఈ వివాదాస్పద నిర్మాణంపై పూర్తి స్థాయి సమగ్ర విచారణ నివేదిక అందిన తర్వాత, సంబంధిత రికార్డులను తుదిసారిగా పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు సంయుక్త అధికారుల బృందం ప్రకటించింది. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠినమైన శిక్షలు ఉంటాయని హెచ్చరించింది. చెరువుల సంరక్షణకు తమ విభాగాల మధ్య సమన్వయం కొనసాగుతుందని స్పష్టం చేసింది.

English Summary

Hydra Launches Joint Inspections With Hyderabad Collector Over Construction Concerns in Hussain Sagar FTL. Officials led by HYDRA, GHMC Commissioners and Hyderabad Collector Dr. Priyanka Ala inspected alleged constructions within Hussain Sagar Full Tank Level (FTL).