ఎల్‌నినో భయాల వేళ బిగ్ రిలీఫ్. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రధాన జలాశయాల్లోకి భారీగా వరద వచ్చిచేరుతోంది. వాగులు, వంకలు ఏకమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. భారీ వర్షాలతో మురిసిపోతున్న అన్నదాతలు రెట్టించిన ఉత్సాహంతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.
తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. కరువు పరిస్థితులు కనిపిస్తున్న వేళ భారీ వర్షాలతో రైతుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. వర్షాలపై మంత్రి పొంగులేటి కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సచివాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. అధికారులంతా క్షేత్రస్థాయిలో ఉండాలని ఆదే శించారు. రాష్ట్రంలో మరో రెండురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కుండపోత వర్షాలు కొనసాగుతున్నాయి. పలు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.
ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు వరుస సెలవులు - తాజా ఆదేశాలు..!!
అటు ప్రధాన ప్రాజెక్టుల్లోకి వరద నీరు పెద్ద ఎత్తున చేరుతుంది. సారంగాపూర్ మండలంలో 128.1 మిల్లీమీటర్లు, వెల్గటూరు మండలంలో 103.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులో 183.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు గురువారం రాత్రి 9 గంటల సమయంలో 3,90,300 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో ప్రాజెక్టు 30 గేట్లు ఎత్తి గోదావరిలోకి 4,50,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సింగరేణి ఏరియాలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ములుగు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవాహం క్రమంగా పెరిగి గురువారం సాయంత్రానికి 2.12 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ చినుకు జాడలేక పంటలకు సాగునీటి ఇబ్బందులు ఎదురయ్యాయి. తాజాగా వరుణుడు కరుణించాడు.అధికార యంత్రాంగం అప్రమత్తం