ఇనుప బ్యారికేడ్లను తొక్కిపడేస్తూ కదిలిన గులాబీ దండు..: హైవేపై హైటెన్షన్

తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శనకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నాయకులను పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడంతో జాతీయ రహదారిపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్తున్న క్రమంలో హైదరాబాద్ - వరంగల్ రహదారిపై జనగామ జిల్లా పెంబర్తి వద్ద పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు.

Advertisement

అలాగే కోమల్ల టోల్ ప్లాజా వద్ద లారీలను రోడ్డుకు అడ్డంగా పెట్టి ప్రతిపక్ష నాయకుల కాన్వాయ్‌ను బలవంతంగా నిలిపివేశారు. ఈ ఆంక్షల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులతో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తీవ్ర వాగ్వివాదానికి దిగారు. నిర్బంధాలను ధిక్కరిస్తూ పోలీసుల బారికేడ్లను బద్దలు కొట్టుకుని బీఆర్ఎస్ శ్రేణులు కన్నెపల్లి వైపు దూసుకెళ్లారు. ఈ పర్యటనలో కేటీఆర్ వెంట మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు ఉన్నారు.

Advertisement

పోలీసులు అడ్డుకున్న పెంబర్తి, కోమల్ల తదితర ప్రాంతాల వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద దాదాపు లక్ష క్యూసెక్కుల గోదావరి జలాలు వృథాగా సముద్రంలోకి పోతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మోటార్లను ఆన్ చేసి నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎల్ నినో వంటి వర్షభావ పరిస్థితులు ఎదురైనా కాళేశ్వరం ప్రాజెక్టు కల్పతరువులా నిలిచిందని, అయినప్పటికీ నీళ్లను ఎత్తిపోయకుండా రైతుల పొలాలను ఎండబెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాజెక్టుల నిర్వహణ చేతకాకపోతే ఆ బాధ్యతను కేసీఆర్‌కు అప్పగించాలని, వారం రోజుల్లోనే పంపులు ఆన్ చేసి జలాశయాలన్నింటినీ నీటితో నింపి చూపిస్తామని కేటీఆర్ సవాల్ విసిరారు. మరోవైపు, సూర్యాపేట నుంచి వేలాది మంది రైతులతో కలిసి కన్నెపల్లి పర్యటనకు బయలుదేరిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ సర్కార్‌ తీరును ఖండించారు.

Advertisement

కన్నెపల్లి పంపులను ఆన్ చేస్తే ఇప్పటికీ లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించవచ్చని తాము క్షేత్రస్థాయిలో నిరూపించి తీరుతామని అన్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శనను వ్యూహాత్మకంగా భగ్నం చేసేందుకు రేవంత్ ప్రభుత్వం పోలీసుల బలగాలను భారీగా మోహరించినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అన్ని అడ్డంకులను ఎదిరిస్తూ ముందుకు సాగుతున్న కేటీఆర్ కాన్వాయ్‌కు స్టేషన్ ఘన్‌పూర్ వద్ద పార్టీ శ్రేణులు, స్థానిక రైతులు ఘన స్వాగతం పలికారు.

English Summary

KTR Alleges Police stopped Him and Other BRS Leaders to Inspect Kannepalli Pump House Kaleswaram. According to the BRS, several public representatives and senior party leaders from the Warangal, Karimnagar and Nalgonda districts are accompanying KTR during the visit.