మటన్‌లో ఎద్దు మాంసం.. కాసుల కక్కుర్తితో నరరూప రాక్షసత్వం..

మనం బ్రతకడానికి తింటున్నామా? చావడానికి తింటున్నామా? బయట రోజురోజుకూ పెరిగిపోతున్న తిండి కల్తీలను చూస్తుంటే సామాన్యుడికి ఒళ్లు గగుర్పొడవడం ఖాయం. ఒకప్పుడు హైదరాబాద్ బిర్యానీ అన్నా, ఇక్కడి మటన్ వంటకాలన్నా దేశవ్యాప్తంగా భోజన ప్రియులు లొట్టలేసుకుని తినేవారు. కానీ, కొందరు కాసుల కక్కుర్తి పడ్డ నరరూప రాక్షసులు మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మొన్నటికి మొన్న మటన్ పేరుతో కుక్క మాంసం అమ్మిన ఘోరాలు మరువకముందే.. తాజాగా భాగ్యనగరంలో మటన్ పేరుతో ఎద్దు మాంసం విక్రయిస్తున్న మరో ముఠా గుట్టు రట్టయింది. మీరు హోటళ్లలో వేల రూపాయలు పోసి ఆర్డర్ ఇచ్చుకుని తింటున్నది అసలు మేక మాంసమేనా? లేక మరేదైనా జంతువుదా? అనే అనుమానాలు ఇప్పుడు నగరవాసులను పట్టి పీడిస్తున్నాయి.

Advertisement

హైదరాబాద్ నగరంలోని హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మల్లేపల్లి ప్రాంతంలో ఈ భయంకరమైన కల్తీ మాంసం దందా వెలుగుచూసింది. ఇక్కడి 'ఉస్మాన్ మీట్ షాప్' నడుపుతున్న ఉస్మాన్ ఖురేషి అనే వ్యక్తి.. మేక మాంసంలో ఎద్దు మాంసాన్ని యథేచ్ఛగా కలుపుతూ తక్కువ ధరకు నగరంలోని పలు హోటళ్లకు సరఫరా చేస్తున్నాడు. దీనిపై స్థానికులకు అనుమానం వచ్చి అధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు రంగు బయటపడింది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ (H-FAST) అధికారులు, స్థానిక హబీబ్‌నగర్ పోలీసులు కలిసి సదరు మటన్ షాపుపై మెరుపు దాడి చేశారు.

Advertisement

50 కిలోల కల్తీ మాంసం స్వాధీనం.. ల్యాబ్‌కు నమూనాలు!

అధికారులు షాపులోకి అడుగుపెట్టి తనిఖీలు చేయగా అక్కడ విక్రయానికి ఉంచిన మాంసాన్ని చూసి అధికారులకే మైండ్ బ్లాంక్ అయింది. అది మేక మాంసం కాదని ప్రాథమికంగా గుర్తించిన అధికారులు, షాపును జల్లెడ పట్టగా ఏకంగా 50 కిలోల కల్తీ (ఎద్దు) మాంసం బయటపడింది. దీంతో వెంటనే ఆ మాంసాన్ని సీజ్ చేసి, నిందితుడు ఉస్మాన్ ఖురేషిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన మాంసం నమూనాలను సేకరించి తదుపరి విచారణ కోసం ల్యాబొరేటరీకి పంపించారు. ల్యాబ్ నివేదిక రాగానే నిందితుడిపై అత్యంత కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అధికారులు సిద్ధమవుతున్నారు.

Advertisement

అసలు కల్తీ లేని వస్తువు ఏది? ప్రజల్లో తీవ్ర ఆగ్రహం!

అసలు నగరంలో కల్తీ లేని వస్తువు అంటూ ఏదైనా ఉందా? అని ప్రజలు తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. పొద్దున లేస్తే తాగే పాలు కల్తీ.. వంట చేసుకునే ఆయిల్ కల్తీ.. బిర్యానీల్లో వేసే అల్లం-వెల్లుల్లి పేస్ట్ కల్తీ.. ఆఖరికి ముక్క లేనిదే ముద్ద దిగని మాంసాహారుల బలహీనతను ఆసరాగా చేసుకుని మటన్‌ను కూడా కల్తీ చేస్తారా? అంటూ నగరవాసులు మండిపడుతున్నారు. ఈ ఘోరం అసలు ఎంతకాలంగా సాగుతోంది? ఏయే హోటళ్లకు ఈ కల్తీ మాంసాన్ని సరఫరా చేశారు? అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. హోటళ్లలో లొట్టలేసుకుని తినేముందు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన భయానక పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్‌లో నెలకొంది.

English Summary

A shocking Mutton adulteration scam has been busted in Hyderabad. The H-FAST team and police raided a meat shop in Mallepally and seized 50 kg of beef being sold as mutton to local hotels. The shop owner, Usman Qureshi, has been arrested.