హైదరాబాద్ లోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థిని కారుమూరు ప్రియాంక రెడ్డికి అమెజాన్ సంస్థ భారీ ఆఫర్ ఇచ్చింది. ఏకంగా రూ. 1.4 కోట్ల ప్యాకేజీతో జాబ్ ఆఫర్ అందించింది. ప్రస్తుతం ఆమె లింక్ డిన్ ప్రొఫెల్ ఆధారంగా యూనైటెడ్ కింగ్ డమ్ లోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ లో ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గీతంలో ఏర్పాటు చేసిన అచీవర్స్ డే ఈవెంట్ లో ఈ ఏడాది క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో అత్యధిక వేతనంతో ఉద్యోగం సంపాదించిన విద్యార్థినిగా ప్రియాంక నిలిచారని గీతం సంస్థ యాజమాన్యం తెలిపింది.
ప్రస్తుతం ప్రియాంక సాధించిన విజయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అలాగే ఇటీవల వోక్స్ సెన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందిన ఓ 23 ఏళ్ల విద్యార్థి ఏడాది కాలంలోనే దాదాపు రూ. 20 కోట్ల అగ్రీ బిజినెస్ స్టార్టప్ ను నెలకొల్పాడు. దాంతో యువత విజన్ పై నెట్టింట ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక ప్రియాంక తండ్రి ఐబీఎం సంస్థలో సీనియర్ మేనేజర్ గా ఉన్నారు. ఆయన ప్రియాంకకు ఓ సలహా ఇచ్చారు. మార్కుల వెంట పడొద్దని సబ్జెక్ట్ ను ప్రాపర్ గా నేర్చుకోవడంపైనే దృష్టి పెట్టాలని సూచించారు. మార్క్స్, నాలెడ్జ్ దేనికవి సొంత దారుల్లో ప్రయాణం చేస్తాయని తెలిపారు. తండ్రి మాటలనే ఆమె స్ఫూర్తిగా తీసుకున్నారు.
ఇక ప్రియాంక మొదటి సంవత్సరం నుంచే తన ప్రిపరేషన్ మొదలు పెట్టారు. తాను రోజులో కేవలం ఒకటి లేదా రెండు గంటలు మాత్రమే ఏకాగ్రతతో చదివేవారు. డేటా స్ట్రక్చర్స్, కోడింగ్, ఆల్గరిథమ్స్ పై పట్టు సాధించారు. ఈ విజయంపై ఆమె ఓ పోస్టులో కీలక విషయాలను వెల్లడించారు. విద్యార్థులకు నాలుగేళ్ల బీటెక్ లో చాలా సమయం దొరుకుతుందని అన్నారు. కానీ చాలామంది మాత్రం ఫైనల్ ఇయర్ లోనే తొందరపడతారని తెలిపారు. వన్ పర్సెంట్ బెటర్ ఎవ్రీ డే అనేది తన మోటో అని తెలిపారు. ప్రస్తుతం ప్రియాంక విజయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.