రేపే కాలేజీల బంద్.. జూలై 10న స్కూళ్లు కూడా బంద్!

తెలంగాణలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, పెండింగ్ ఫీజు బకాయిల విడుదల కోరుతూ విద్యార్థి, సామాజిక సంఘాలు పోరుబాట పట్టాయి. రాష్ట్రంలో విద్యావ్యవస్థను పీడిస్తున్న సమస్యలపై జూలై నెలలో రెండు విడతలుగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునివ్వడంతో క్యాంపస్‌లలో వేడి రాజుకుంది. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జూలై 2న కాలేజీల బంద్‌కు, జూలై 10న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు వేర్వేరు సంఘాలు పిలుపునిచ్చాయి.

Advertisement

రేపే రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్!

పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ ఐకాస (బీసీ జేఏసీ) ఆధ్వర్యంలో జూలై 2న రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చారు. హైదరాబాద్ గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద బీసీ ఐకాస ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసిన నాయకులు, బంద్ గోడపత్రికను ఆవిష్కరించారు.

Advertisement

ఈ సందర్భంగా బీసీ ఐకాస ఛైర్మన్‌ జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు బడ్జెట్‌లు ప్రవేశపెట్టినా, పేద విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో దాదాపు 14 లక్షల మంది పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు రావాల్సిన రూ.7 వేల కోట్ల ఫీజు బకాయిలను ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేయలేదని, దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

జూలై 10న విద్యాసంస్థల టోటల్ బంద్!

మరోవైపు, రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ విద్యారంగ సమస్యల పరిష్కారానికై జూలై 10న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల (స్కూళ్లు, కాలేజీల) బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఉమ్మడి సమావేశంలో AISF, SFI, PDSU, AIDSO, AIFDS, AISB, AIPSU విద్యార్థి సంఘాల నాయకులు కలిసి బంద్‌కు సంబంధించిన అధికారిక పోస్టర్‌ను ఆవిష్కరించారు.

Advertisement

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, బడ్జెట్ కేటాయింపులు వంటి డిమాండ్లతో ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం చేపడుతున్న ఈ పోరాటానికి ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు పూర్తిగా సహకరించి బంద్‌ను విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు.

English Summary

Two major bandh calls in Telangana! BC JAC announces college bandh on July 2 over pending fee reimbursement dues, while Left student unions call for a state-wide educational institutions bandh on July 10. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జూలై 2న కాలేజీల బంద్‌కు, జూలై 10న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు వేర్వేరు సంఘాలు పిలుపునిచ్చాయి.