పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు

పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పలు కఠిన నిబంధనలను విధించిన న్యాయస్థానం.. లక్ష రూపాయల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసులో దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని బండి భగీరథ్ కు ఆదేశాలు జారీ చేసింది. సాక్షులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభావితం చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది. ఒకవేళ బెయిల్ షరతులను ఉల్లంఘిస్తే మాత్రం చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని కోర్టు హెచ్చరించింది.

Advertisement

హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో గత మే 18న అరెస్ట్ అయిన బండి భగీరథ్.. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. జులై 6వ తీర్పున రిజర్వ్ చేయగా.. ఇవాళ తుది తీర్పును వెలువరించింది. విచారణ సమయంలో బాధితురాలి తరఫు న్యాయవాది బండి భగీరథకు బెయిల్ ఇవ్వద్దంటూ వాదనలు వినిపించారు. నిందితుడి తండ్రి కేంద్ర మంత్రి కావడంతో బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టుకు విన్నవించారు.

Advertisement

పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. బండి భగీరథ్ విద్యార్థి అని.. 45 రోజులకు పైగా జైలులో ఉండటం వల్ల చాలా కోల్పోయాడని కోర్టుకు తెలిపారు. బెయిల్ మంజూరు చేస్తే కోర్టు విధించిన షరతులకు కట్టుబడి ఉంటారని న్యాయస్థానికి విన్నవించారు. ఇరు పక్షాల వాదన విన్న అనంతరం హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

English Summary

Telangana High Court has granted conditional bail to Union Minister Bandi Sanjay's son Bandi Bhagirath in the POCSO case.