జర్నలిస్ట్ కేవీ రెడ్డిని గుంజుకెళ్లిన ఏపీ పోలీసులు! కవిత సీరియస్ వార్నింగ్

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జర్నలిస్ట్ కేవీ రెడ్డి (KVR) అరెస్ట్ ఉదంతం మరోసారి తీవ్ర రాజకీయ కలకలం రేపుతోంది. గతంలోనే కేవీ రెడ్డిని అరెస్ట్ చేసి వివాదానికి తెరలేపిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు.. తాజాగా మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లో మరోసారి అతడిని అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. విజయనగరం జిల్లా బాడంగి పోలీస్ స్టేషన్‌కు చెందిన అధికారులు మఫ్టీలో వచ్చి, కేవీ రెడ్డిని ప్రైవేట్ వాహనంలో ఏపీకి తరలించారు.

Advertisement

అరెస్ట్ సమయంలో ఆయన భార్య, చిన్న పిల్లలు కన్నీళ్లు పెట్టుకుంటూ అడ్డుపడినా ఏపీ పోలీసులు కనికరించలేదు. ఏపీకి తరలించే ముందు స్థానిక సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ముందస్తు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ హృదయ విదారక అరెస్ట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో తెలంగాణ రాజకీయాల్లో పెను తుఫాను సృష్టించింది.

Advertisement

తెలంగాణ పోలీసుల తీరుపై కవిత తీవ్ర ఆగ్రహం!

జర్నలిస్ట్ కేవీ రెడ్డి అరెస్ట్‌పై బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మన గడ్డపై ఒక తెలంగాణ జర్నలిస్ట్‌ను ఏపీ పోలీసులు లాక్కెళ్తుంటే, ఇక్కడి పోలీసులు వారికి సహకరించడం అత్యంత దుర్మార్గమని ఆమె ధ్వజమెత్తారు.

"కళ్లెదుటే భార్యాపిల్లలు ఏడుస్తున్నా పట్టించుకోకుండా, ఏపీ పోలీసులకు మన ఖాకీలు వత్తాసు పలకడం సిగ్గుచేటు. తెలంగాణ జర్నలిస్టుల అరెస్టులకు సహకరిస్తున్న ఇక్కడి ప్రభుత్వం.. మన గడ్డ మీద నిలబడి 'తెలంగాణావాదాన్ని వేర్పాటు వాదం' అని వ్యాఖ్యానించిన సినిమా నటుల విషయంలో ఎందుకు మౌనంగా ఉంది? వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?" అని కవిత నిలదీశారు.

Advertisement

సీఎం ఏపీకి తొత్తుగా మారారు!

ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. "తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీకి తొత్తుగా ఉండొచ్చు కానీ, తెలంగాణ జర్నలిస్టులకు, ఇక్కడి ప్రజలకు ఆ అవసరం లేదు" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మేధావులు, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు. తక్షణమే కేవీ రెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేసిన కవిత.. కేవీ రెడ్డి కుటుంబానికి తెలంగాణ రక్షణ సేన (బీఆర్ఎస్) పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

జగన్‌ను కలిసినందుకే కక్షసాధింపా?

ఇటీవలే కేవీ రెడ్డిని కర్నూలు పోలీసులు అరెస్ట్ చేసి కొన్ని రోజులు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఆ కేసులో బెయిల్‌పై విడుదలైన తర్వాత కేవీ రెడ్డి.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్‌ను కలిసిన కొద్ది రోజులకే మళ్లీ విజయనగరం పోలీసులు హైదరాబాద్‌కు వచ్చి, పాత కక్షలను మనసులో పెట్టుకుని అర్ధరాత్రి పూట ఇంత దారుణంగా అరెస్ట్ చేయడం వెనుక ముమ్మాటికీ రాజకీయ కుట్ర ఉందనే ఆరోపణలు వైసీపీ సోషల్ మీడియా నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి.

English Summary

High drama in Hyderabad as AP police arrest a prominent Telangana journalist KV Reddy at midnight. Opposition leaders strongly condemned the local police for cooperating with AP cops and demanded the immediate release of the media person.