ఆ మంత్రుల పై రేవంత్ డిసైడ్ అయ్యారా..!?

తెలంగాణలో కొందరు మంత్రుల తీరు పార్టీకి సమస్యగా మారుతోంది. తమ శాఖల నిర్వహణ కంటే వివాదాలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. వారిలో ఇద్దరి విషయంలో ఇప్పటి కే పార్టీ అధినాయకత్వం ఆగ్రహం గా ఉంది. మరి కొంత సమయం ఇచ్చి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన చేసింది. అయినా, వారిలో మార్పు కనిపించటం లేదనే అభిప్రాయం పార్టీ లో వినిపిస్తోంది. దీంతో.. వారిని ఇక ఉపేక్షించకుండా చర్యలకు సీఎం రేవంత్ సమాయత్తం అవుతున్నట్లు పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

Advertisement

రేవంత్ కేబినెట్ లో కొందరి వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతోంది. కేబినెట్‌లో సీనియర్లుగా చెప్పుకొనే వారు తోచింది తాము చేసుకుంటూ పోతుండటంతో అనేక సమస్యలు వస్తున్నాయి. కేబినెట్ లోని మంత్రుల తీరు కారణంగా ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతోందనే వాదన బలంగా వినిపిస్తోంది. పలు కేబినెట్ సమావేశాల్లో సీఎం రేవంత్ క్లాస్ తీసుకున్నా వారిలో మార్పు రావటం లేదు. అంతర్గతంగా చర్చించాల్సిన అంశాల పైన ఓపెన్ గా ఆగ్రహం వ్యక్తం చేయటం.. కేబినెట్ సమావేశాలకు దూరంగా ఉండటం.. సీఎం నిర్ణయాలను తప్పుబట్టే విధంగా వ్యాఖ్యలు చేయటం వంటివి సమస్యగా మారుతున్నాయి. తాను ఎంత కష్టపడినా కొందరి తీరు కారణంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తున్నారనే అభిప్రాయం పార్టీ ముఖ్యుల్లో వినిపిస్తోంది. వీరిని కట్టడి చేసేందుకు త్వరలోనే నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు.

Advertisement

కేబినెట్ ప్రక్షాళన తప్పదా..!

కేబినెట్ మంత్రుల మధ్య సమస్వయం లేకపోవటం స్పష్టంగా కనిపిస్తోందనే విశ్లేషణలు ఉన్నాయి. సీనియర్ నేతలు - మంత్రుల మధ్య వివాదాలు బయటకు వస్తున్నాయి. ఈ సమస్య ల పైన హైకమాండ్ కు ఫిర్యాదులు వెళ్లటం కూడా పార్టీ ముఖ్య నేతలకు నచ్చటం లేదు. వరంగల్ లాంటి ప్రాంతాల్లో నేతల మధ్య కోల్డ్ వార్ అనేక సందర్భాల్లో బయట పడింది. ప్రత్యక్షంగా ఆధిపత్య పోరుగా మారుతోంది. ఒకరి పైన మరొకరు ఫిర్యాదు చేసుకోవటం పార్టీకి సమస్యలను తెచ్చి పెడుతోంది. దీంతో పాటుగా ప్రతిపక్షాల ట్రాప్ లో కొందరు మంత్రులు పడుతున్నారని.. దీని కారణంగా రాజకీయంగా నష్టం జరుగుతోందనే వాదన ఉంది. దీంతో.. ఈ మొత్తం వ్యవహారాల పైన పార్టీ అధినాయకత్వానికి వివరించి అవసరమైన మార్పులు - చేర్పుల దిశగా సీఎం రేవంత్ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికలు... ఆ తరువాత అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పని చేయాల్సిన పరిస్థితుల్లో ఇలా సమస్యలు తీసుకొస్తున్న వారి విషయంలో కఠినంగా ఉండాలని భావిస్తున్నారు. దీంతో.. ఈ నెలాఖరులో మంత్రివర్గంలో మార్పులకు అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రక్షాళన తప్పదని చెబుతున్నారు.

English Summary

Telangana ministers performance and recent controversies have become a concern for CM Revanth, is expected to take key decisions