ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌ కృష్ణారెడ్డి అరెస్ట్‌..!

హైదరాబాద్ లోని నేషనల్ పోలీస్ అకాడమీలో సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిర్యాలగూడ వద్ద ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనంతరం ఉదయ్ కృష్ణారెడ్డిని హైదరాబాద్ కు తరలించారు. రెండు రోజులుగా ముమ్మరంగా గాలించిన పోలీసులు ఎట్టకేలకు ఆయన్ను అరెస్ట్ చేశారు. దాంతో బాధితురాలి ఫిర్యాదుపై ఉదయ్‌ కృష్ణారెడ్డి స్టేట్‌ మెంట్‌ ను రికార్డు చేయనున్నారు.

Advertisement

అయితే ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి పరారీలో ఉన్నట్లు వచ్చిన వార్తలను అంతకుముందు ఆయన ఖండించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం తన సొంత ఊరు ఊళ్లపాలెంలోనే ఉన్నట్లు పేర్కొన్నారు. చట్టంపై తనకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉందని పోలీసుల విచారణకు సంపూర్ణంగా సహకరిస్తానని స్పష్టం చేశారు. తన నాన్నమ్మకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో సొంతూరుకు వచ్చినట్లు తెలిపారు.

Advertisement

ఇక నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న తనను ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి లైంగికంగా వేధించాడంటూ మహిళా ట్రైనీ ఆఫీసర్ అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దాంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ నాటకం ఆడారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాగానే పరారీలో ఉన్నారు. రెండు రోజుల గాలింపు చర్యల తర్వాత తాజాగా ఆయన్ను మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తేలింది.