Gautam Gambhir: గంభీర్ పై తేల్చేసిన బీసీసీసీ..! త్వరలో బోర్డు కీలక భేటీ..!

ఈ ఏడాది మార్చిలో టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన టీమిండియా.. తాజాగా రెండు నెలల గ్యాప్ లో విదేశాల్లో రెండు సిరీస్ లు కోల్పోయింది. తొలుత ఐర్లాండ్ లో, ఆ తర్వాత ఇప్పుడు ఇంగ్లండ్ లో టీ20 సిరీస్ ఓటములు పలకరించాయి. వీటికి కెప్టెన్సీ మార్పు ఓ కారణం కాగా, టీమ్ నిలకడలేని తనం, కోచ్ గంభీర్ పనితీరు ఇతర కారణాలుగా కనిపిస్తున్నాయి. అయితే సాధారణంగా ఓటములు ఎదురైనప్పుడు కోచ్ ల పనితీరుపై విమర్శలు సహజమే. ఇందుకు ప్రస్తుత కోచ్ గంభీర్ కూడా మినహాయింపు కాదు.

Advertisement

ఈ నేపథ్యంలో కోచ్ గంభీర్ (Gautam Gambhir)ను తప్పించాలనే డిమాండ్లు మొదలయ్యాయి. దీంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న బీసీసీఐ.. గంభీర్ ను తప్పించడం ఖాయమన్న చర్చ జరుగుతోంది. దీనిపై ఇవాళ స్వయంగా బోర్డు స్పందించింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ వంటి జట్ల చేతిలో టీ20 సిరీస్ ఓటములకు దారితీసిన టీమిండియా పేలవ ప్రదర్శనపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. అయితే, బోర్డు ఎలాంటి ఆవేశపూరిత లేదా హడావిడి నిర్ణయాలు తీసుకోదని ఆయన స్పష్టం చేశారు. జూలై 19న వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఈ సమావేశం జరుగుతుందని ఆయన వెల్లడించారు.

Advertisement

తాజా పరిణామాల నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భవిష్యత్తుకు ప్రస్తుతానికి ఎటువంటి ముప్పు లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఆయనకు 2027 వన్డే ప్రపంచ కప్ వరకు బీసీసీఐతో ఒప్పందం ఉంది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో టీ20 జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదని, దీనిని బీసీసీఐ ప్రస్తుతం గమనిస్తోందని ఎడిన్‌బర్గ్‌లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశం సందర్భంగా బోర్డు కార్యదర్శి సైకియా తెలిపారు. ఈ ఓటముల్ని ఆయన చెడు దశగా అభివర్ణించారు. అయితే వన్డే సిరీస్ తర్వాత జరిగే సమీక్షా సమావేశం పూర్తిగా జట్టు ప్రదర్శన, లోపాలను సరిదిద్దుకోవడంపైనే ఉంటుందని, వేరే ఏ విషయంపైనా చర్చ జరగదని సైకియా తేల్చిచెప్పేశారు.