ఏపీలో 331 స్పెషలిస్ట్ డాక్టర్ల భర్తీకి నోటిఫికేషన్: రూ. లక్షకుపైగా జీతం, ఇంటర్వ్యూకి వెళ్లండి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో పలు పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయించింది. రాష్ట్ర విధాన పరిషత్ ఆస్పత్రుల్లో 331 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేసన్ జారీ చేసింది. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ ఎం శ్రీనివాసరావు ఈ మేరకు వివరాలను వెల్లడించారు.
14 స్పెషాలిటీల్లో డాక్టర్ల నియామకానికి జులై 5, 7, 10 తేదీల్లో ప్రత్యక్ష నియామకాలు చేపపట్టనున్నట్లు ఆయన తెలిపారు. రెగ్యులర్, కాంట్రాక్ట్ విధానంలో గిరిజన, గ్రామీణ ఆస్పత్రుల్లో పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అభ్యర్థులు.. విజయవాడ, గొల్లపూడిలో ఉన్న ఏపీవీవీపీ కమిషనర్ కార్యాలయంలో వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు.

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలకోసం cfw.ap.nic.in, hmfw.ap.gov.in వెబ్‌సైట్‌లలో చూడొచ్చని తెలిపారు. ఇతర వివరాల కోసం 06301138782 ఫోన్ నంబరుకు గానీ, [email protected] ఈమెయిల్‌కు గానీ సంప్రదించాలని సూచించారు. తాజా నియామకాల్లో కాంట్రాక్ట్ పోస్టులకు స్థానికత, రోస్టర్ విధానంలో ప్రభుత్వం సడలింపు ఇచ్చిందని శ్రీనివాసరావు వెల్లడించారు.
ఈ ఉద్యోగాలకు భారీగా వేతనాలు ఉండటం గమనార్హం. కంట్రాక్ట్ పద్ధతి నియామకాల్లో గిరిజన ఆస్పత్రుల్లో రూ. 2.50 లక్షలు, గ్రామీణ ఆస్పత్రుల్లో రూ. 2 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 1.30 లక్షలు చొప్పున వేతనాలు ఉంటాయని తెలిపారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకుండా చూడాలనే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే 48వేలకుపైగా పోస్టులను భర్తీ చేసింది. ఏపీవీవీపీ పరిధిలోని గిరిజన, గ్రామీణ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్లను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచడానికి ఇప్పటికే పలుమార్లు వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహించారు. వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి మరోసారి ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications