భారత్ లో ఆ డబ్బుల పంపిణీ స్కీమ్ వద్దే వద్దు..! ఎందుకో చెప్పిన శ్రీధర్ వెంబూ..!
భారత్ లో ఓవైపు ఏఐ, ఆటోమేషన్ వేగంగా విస్తరిస్తున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అందరికీ కనీస ఆదాయం కల్పించేలా యూనివర్శల్ బేసిక్ ఇన్ కమ్ (UBI) పథకాన్ని అమలు చేసే దిశగా ఆలోచన చేస్తోంది. దీని వల్ల ప్రతి పౌరుడికి ఎలాంటి నిబంధనలు లేకుండా క్రమం తప్పకుండా నిర్ణీత మొత్తంలో నగదు అందిస్తారు. దీని వల్ల పేదరిక నిర్మూలన, ఆర్థిక భద్రత సాధ్యమవుతుందనే అంచనాలున్నాయి. అయితే జోహో (ZOHO)వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబూ (Sridhar Vembu) మాత్రం ఈ ఐడియాను పూర్తిగా తప్పుబట్టారు.
భారతదేశం ఈ యూనివర్సల్ బేసిక్ ఇన్‌కమ్ విధానానికి దూరంగా ఉండాలని జోహో అధినేత శ్రీధర్ వెంబూ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఉచితంగా డబ్బులు పంచే నమూనా దేశ పురోగతికి అంత మంచిది కాదని, దానికి బదులుగా అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలను (Deep Tech) పెంపొందించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. దేశీయంగా పరిశోధనలు పెరిగినప్పుడే ఉపాధిని, ఆర్థిక వ్యవస్థను సుస్థిరంగా నిలబెట్టుకోగలమని సూచించారు. స్విట్జర్లాండ్‌తో భారతదేశాన్ని పోలుస్తూ తాజాగా ఎక్స్ లో ఆయన ఓ ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. స్విట్జర్లాండ్‌లోని ఒక పాఠశాల ఉపాధ్యాయుడు కేవలం రెండు నుంచి నాలుగు రోజుల సంపాదనతో ఐఫోన్ కొనగలిగితే, ఒక భారతీయ ఉపాధ్యాయుడికి అదే ఐఫోన్ కొనుగోలు చేయడానికి రెండు నుంచి నాలుగు నెలల సమయం ఎందుకు పడుతుందని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యత్యాసానికి ఆయా దేశాల సాంకేతిక సామర్థ్యం, ఆర్థిక పంపిణీ విధానాలే ప్రధాన కారణమని తేల్చి చెప్పారు.

ఒక ప్రాంతంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంటే, అక్కడ ఉపాధ్యాయులు, రైతులు, ఇతర సేవా రంగాల వారికి కూడా మెరుగైన వేతనాలు చెల్లించే వీలు కలుగుతుందని ఆయన చెప్తున్నారు. సాంకేతికత ద్వారా సాధించే ఆర్థిక ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా అందుతాయన్నారు. కేవలం ఐటీ రంగంలో ఉద్యోగాల సృష్టి మాత్రమే కాకుండా, వ్యవసాయం, విద్య, వైద్య రంగాలలో పనిచేసే వారి జీవన ప్రమాణాలు పెంచడం డీప్ టెక్నాలజీ ద్వారానే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. యూనివర్సల్ బేసిక్ ఇన్‌కమ్ పద్ధతిని ఒక రకమైన సంక్షోభంగా అభివర్ణించిన శ్రీధర్..దానిని నివారించాలంటే భారీగా పరిశోధనలు జరగాలన్నారు. అభివృద్ధి చెందిన స్విట్జర్లాండ్, ఇజ్రాయెల్ వంటి దేశాలు తక్కువ జనాభా కలిగి ఉన్నప్పటికీ ప్రపంచ స్థాయి సాంకేతికతతో రాణిస్తున్నాయని గుర్తుచేశారు. టెక్నాలజీ రంగంలో స్వయంసమృద్ధి సాధించకపోతే ఇతర దేశాలపై ఆర్థికంగా ఆధారపడాల్సి వస్తుందని శ్రీధర్ వెంబు హెచ్చరించారు. ఏఐ వల్ల ఐటీ రంగంలో కొత్త ఉద్యోగాల సృష్టి తగ్గుతున్న తరుణంలో, నిరంతర ఆవిష్కరణలే దేశాన్ని ఆర్థిక పురోగతి వైపు నడిపిస్తాయని పేర్కొన్నారు.














Click it and Unblock the Notifications