LLR: ఇక ఇంటి నుంచే.. సచివాలయాల్లో సైతం అప్లికేషన్స్.
డ్రైవింగ్ నేర్చుకోవాలనుకునే వారికి, కొత్తగా లైసెన్స్ పొందాలని చూసే వారికి రవాణా శాఖ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ సర్కార్. ఇప్పటివరకు ఎల్‌ఎల్‌ఆర్ (Learner's Licence) కోసం స్లాట్ బుక్ చేసుకొని, ఆఫీసుల చుట్టూ తిరిగి, అక్కడి కంప్యూటర్ల ముందు పరీక్ష రాసే పద్ధతికి తెరపడింది. ఇకపై ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరైనా సరే నేరుగా తమ ఇళ్ల నుంచే ఆన్‌లైన్‌లో ఎల్‌ఎల్‌ఆర్ పరీక్ష రాసే సరికొత్త విధానాన్ని రవాణా శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నూతన సేవలు ఆదివారం నుంచే అమల్లోకి రావడం విశేషం.
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఆన్‌లైన్ ఎల్‌ఎల్‌ఆర్ విధానం ఉన్నప్పటికీ, కేవలం ఆధార్ ఈ-కేవైసీ ఆధారంగా జారీ చేస్తుండటంతో వేరేవాళ్లు పరీక్ష రాసే అవకాశం ఉండేది. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఎలాంటి మోసాలకు తావులేకుండా అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 'సేఫ్ ఎగ్జామ్ బ్రౌజర్','ఎగ్జామ్ ప్రోక్టరింగ్' (AI. టూల్స్) టెక్నాలజీని ఇందులో వాడుతున్నారు. పరీక్ష రాసే సమయంలో అభ్యర్థి తల పక్కకు తిప్పినా, గదిలో వేరేవాళ్ల మాటలు వినిపించినా సిస్టమ్ వెంటనే పరీక్షను రద్దు చేస్తుంది. అలాగే ఒక ఐపీ అడ్రస్‌తో రోజుకు ఇద్దరు మాత్రమే పరీక్ష రాసేలా పరిమితి పెట్టారు. ముఖం సరిపోలకపోతే ఆధార్ అథెంటికేషన్ కోసం 5 సార్లు మాత్రమే అవకాశం ఇస్తారు.

ఆన్‌లైన్‌లో ఎల్‌ఎల్‌ఆర్ అప్లై చేసుకోవడం ఇలా..
- ముందుగా సారథి పోర్టల్‌లోకి వెళ్లి ఎల్‌ఎల్‌ఆర్ ఆన్‌లైన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- ఆ తర్వాత మీ రాష్ట్రం పేరు సెలెక్ట్ చేసుకొని, ఆధార్ వివరాలు ఎంటర్ చేయాలి.
- ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌తో ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించగానే అప్లికేషన్ జనరేట్ అవుతుంది.
- కెమెరా ఉన్న డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్‌లో అప్లికేషన్ ఓపెన్ చేసి, ఫోన్‌కు వచ్చిన పిన్ నంబర్ ఎంటర్ చేయాలి.
- మొత్తం 20 ప్రశ్నలకు గాను కనీసం 12 ప్రశ్నలకు (60 శాతం) సరైన సమాధానాలు ఇస్తే వెంటనే ఎల్‌ఎల్‌ఆర్ డిజిటల్‌గా జారీ అవుతుంది.
మాక్ టెస్ట్‌లతో ప్రాక్టీస్‌కు అవకాశం
పరీక్ష ఎలా ఉంటుందోనని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, ఎలా సమాధానాలు ఇవ్వాలనే దానిపై అవగాహన కోసం సారథి పోర్టల్‌లో ఎన్నిసార్లైనా 'మాక్ టెస్ట్‌లు' రాసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా ల్యాప్‌టాప్‌లు లేదా సిస్టమ్స్ అందుబాటులో లేకపోతే, వారు నేరుగా తమ దగ్గర్లోని గ్రామ/వార్డు సచివాలయాలకు వెళ్లొచ్చు. అక్కడ సచివాలయ సిబ్బంది సహకారంతో ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకొని, అక్కడే పరీక్ష రాసే సౌలభ్యాన్ని కూడా కల్పించారు. ఆధార్ లేనివారు లేదా ఈ-కేవైసీ కానివారు మాత్రం పాత పద్ధతిలోనే నేరుగా ఆర్టీఓ ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది.
రద్దీ తగ్గేలా మాస్టర్ ప్లాన్
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సుమారు 6 వేల నుంచి 8 వేల వరకు ఎల్‌ఎల్‌ఆర్‌లు జారీ అవుతున్నాయి. వీరంతా ఇప్పటివరకు రాష్ట్రంలోని 84 ఆర్టీఓ ఆఫీసులకు క్యూ కట్టాల్సి వచ్చేది. ఈ కొత్త ఆన్‌లైన్ విధానం ద్వారా ఆ రద్దీ పూర్తిగా తగ్గనుంది. అయితే, ఆన్‌లైన్‌లో ఎల్‌ఎల్‌ఆర్ పొందిన వారు ఆ తర్వాత నెల రోజులకు నుంచి 6 నెలలలోపు ఆర్టీఓ ఆఫీసులోని ట్రాక్‌పై డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరై పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ పొందాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.














Click it and Unblock the Notifications
