మద్యం అమ్మకాల్లో సరి కొత్త విధానం అమల్లోకి - టైమింగ్స్ సహా, ఇక నుంచి..!!
మద్యం అమ్మకాల పై ఏపీ ఎక్సైజ్ శాఖ కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. కొన్ని ప్రాంతాల్లో ఎక్సైజ్ శాఖ నిర్ణయించిన సమయాలకు భిన్నంగా అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించారు. అదే విధంగా కల్తీ మద్యం అమ్మకాల పైన అపోహలు తెలిగించాలని డిసైడ్ అయ్యారు. దీంతో.. అమ్మకాల లక్ష్యాలు తగ్గకుండా కొత్తగా మరో విధానం అమలుకు సిద్దమయ్యారు. దీంతో.. ప్రతీ మద్యం దుకాణంలో చేసే ప్రతీ విక్రయం పైనా సమాచారం అందుతుంది. ఇందు కోసం తాజా మార్గదర్శకాలు సిద్దం చేసారు.
రాష్ట్రంలో మద్యం అమ్మకాల విషయంలో కొత్త విధానం అమల్లోకి తెస్తున్నారు. ఎక్సైజ్ శాఖ తాజా నిర్ణయాల మేరకు మద్యం దుకాణాల్లో స్కానింగ్ విధానాన్ని తీసుకు రానుంది. మద్యం సీసాను స్కాన్ చేసిన తర్వాతే వినియోగదారుకు దుకాణదారు అమ్ముతారు. స్కాన్ చేసిన వెంటనే దాని వివరాలు, ధర స్క్రీన్‌పై కనిపిస్తాయి. అలాగే స్కానింగ్ మెషీన్ స్పీకర్లోనూ ధర వినిపిస్తుంది. ఇప్పటిదాకా సూపర్ మార్కెట్లలో అందుబాటులో ఉన్న ఈ టెక్నాలజీని ఎక్సైజ్ శాఖ మద్యం దుకాణాలకూ వర్తింపజేయనుంది. రాష్ట్రంలోని అన్ని మద్యం షాపులకూ స్కానింగ్ మెషీన్లు సరఫరా చేసే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. దీనికోసం లైసెన్సీలు నెలవారీ అద్దె చెల్లించాలి.
అదే విధంగా మద్యం షాపులు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తాయి. స్కానింగ్ మెషీన్లు కూడా ఆ సమయంలో మాత్రమే పనిచేసేలా సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నారు.

పూర్తి స్థాయిలో ట్రాకింగ్
తాజా నిబంధనల్లో భాగంగా రాత్రి 10 దాటిన వెంటనే ఆగిపోయే మెషీన్లు తిరిగి ఉదయం 10గంటలకు పనిచేయడం ప్రారంభించేలా డిసైడ్ చేసారు. దీంతో, నిర్ణయించిన టైమింగ్స్ దాటిన తర్వాత, ఉదయాన్నే ఇష్టారాజ్యంగా మద్యం అమ్మడానికి అవకాశం లేకుండా ఈ విధానం అమలు చేస్తున్నారు. ప్రస్తుతం అనేక మంది లైసెన్సీలు పనివేళలతో సంబంధం లేకుండా నచ్చినట్లు మద్యం అమ్ముతున్నారు. పలు ప్రాంతాల్లో ఉదయం నుంచే అమ్మకాలు అనధికారికం గా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ కొత్త విధానంతో దీనికి అడ్డుకట్ట వేయవచ్చని భావిస్తున్నారు. ఏదైనా సీసాను స్కాన్ చేయకుండా విక్రయిస్తే దానికి వ్యాపారులు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. వారికి ఉల్లంఘన స్థాయిని బట్టి జరిమానాలు విధిస్తారు. దీంతో, ఈ స్కానింగ్ విధానం అమల్లోకి వస్తే మద్యం అమ్మకాలకు సంబంధించిన రియల్‌టైమ్ డేటా ప్రభుత్వానికి తెలుస్తుంది.












Click it and Unblock the Notifications
