Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి..
ఒకరోజు ఒక రాజు తన రాజ్య పర్యటనకు పయనమయ్యాడు. అలా ఏనుగుపై రాజ్యం మొత్తం కలియతిరుగుతూ ఓ గంధపు చెక్కల దుకాణం వద్ద ఆగాడు. అక్కడే ఉన్న మంత్రితో రాజు ఇలా అన్నాడు. 'నాకు ఆ దుకాణంలోని వ్యాపారిని ఉరి తీయాలని అనిపిస్తుంది' అని అన్నాడు. మంత్రి కారణం అడిగేలోపే రాజు ఏనుగుపై ముందుకు సాగాడు. అయితే మరుసటిరోజు ఆ మంత్రి మారువేషం కట్టి ఆ గంధపు చెక్కల దుకాణానికి వెళ్లాడు. అతని వ్యాపారం బాగోగులను అడిగి తెలుసుకున్నాడు. అప్పుడు ఆ దుకాణదారుడు.. " నా దుకాణానికి కొనుగోలుదారులు చాలా అరుదుగా వస్తుంటారు. చాలా మంది గంధపు చెక్కల వాసన చూసి వెళ్తుంటారు. కానీ కొనుగోలు చేయరు" అని తన బాధను వెల్లగక్కాడు.
అంతేకాక ఇప్పుడు నాకున్న ఒకే కోరిక ఏంటంటే..? మన రాజుగారు త్వరగా మరణించాలని.. ఎందుకంటే రాజు అంత్యక్రియలకు చాలా గంధపు చెక్కలు అవసరం అవుతాయి.. గంధపు చెక్కలను విక్రయించే దుకాణం మన రాజ్యంలో నాది మాత్రమే ఉంది. దాంతో నా కష్టాలన్నీ తొలగిపోతాయి.. అని ఆ దుకాణదారుడు తెలిపాడు. ఓవైపు రాజు ఆ దుకాణదారుడి పట్ల ఆలోచించిన తీరు.. అలాగే దుకాణదారుడు రాజు పట్ల ఆలోచించిన తీరును మంత్రి గ్రహించాడు.
ఇక మారువేషంలో ఉన్న మంత్రి.. నేను కొన్ని గంధపు చెక్కలను కొనాలని వచ్చినట్లు దుకాణదారుడితో తెలిపాడు. అందుకు సంతోషించిన ఆ వర్తకుడు.. ఏరికోరి నాణ్యమైన గంధపు చెక్కలను అందిస్తాడు. వాటిని తీసుకెళ్లిన మంత్రి రాజుకు ఇచ్చి.. ఆ వ్యాపారి మీకు కానుకగా పంపాడని చెప్తాడు. వాటి సువాసనను ఆస్వాధించి ఎంతో సంతోషించిన రాజు.. ఆ వ్యాపారికి బంగారు నాణెలను పంపిస్తాడు. అలాగే ఆ వ్యాపారిని ఉరి తీయాలనే చెడు ఆలోచన వచ్చినందుకు రాజు పశ్చాత్తాపపడతాడు. ఇక ఆ నాణెలను అందుకున్న వ్యాపారి.. తాను కష్టాల్లో ఉన్నానని తెలిసి రాజు తనకు సాయం చేశాడని అనుకుంటాడు. అంతేకాక తాను రాజు చనిపోవాలని కోరుకున్నట్లు గుర్తు చేసుకుని పశ్చాత్తాపపడతాడు. దాంతో తన తప్పును అటు రాజు, ఇటు వ్యాపారి తెలుసుకున్నారు.

నీతి: మన ఆలోచనలే మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఇతరుల పట్ల ఎప్పుడూ మంచి ఆలోచనలే పెంచుకోవాలి.. చెడు ఆలోచనలు పెంచుకుంటే అవి చెడు ఫలితాలకే దారి తీస్తాయి. మన ఆలోచనలు మారితే మన ప్రవర్తన మారుతుంది. మన ప్రవర్తన మారితే మన జీవితాలూ మారుతాయి.












Click it and Unblock the Notifications
