దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులు మూసివేత.. 15 రోజులే డెడ్ లైన్..
ప్రస్తుతం పాకిస్థాన్ లో ఇంధన సంక్షోభం ఆకాశాన్ని తాకుతోంది. పశ్చిమాసియాలో ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతలు, ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధిపై ఆంక్షల నేపథ్యంలో పాకిస్థాన్ లో ఇంధన సంక్షోభం తలెత్తింది. దాంతో అసలే అంతంత మాత్రంగా ఉన్న పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి మరింతగా క్షీణించింది. ప్రజలు నిత్యావసరాల ధరలు పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా అక్కడి ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇక చమురు నిల్వల కొరత కారణంగా పాకిస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లను ఎప్పటికప్పుడు మారుస్తూ వస్తోంది. దానివల్ల పెట్రోల్ యాజమాన్యాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.
ప్రభుత్వం ఇలా పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజూ సమీక్షించి కొత్త ధరలను ప్రకటించడం ద్వారా పెట్రోల్ బంకుల యాజమాన్యాలు తీవ్రంగా నష్టపోతున్నాయని.. వాళ్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని డీలర్లు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ సంచలన ప్రకటన చేసింది.

షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులను మూసివేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు తమ డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వానికి 15 రోజుల గడువు ఇచ్చింది. ప్రభుత్వం ఇలా పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతి రోజూ మార్చకుండా 30 రోజులకోసారి మాత్రమే మార్చే విధంగా పాలసీని తీసుకురావాలని డిమాండ్ చేసింది. అలాగే పెట్రోల్ బంకులు నిర్వహించే యజమానులకు ఇప్పుడు వస్తున్న కమిషన్ ను 8 శాతానికి పెంచాలని డిమాండ్ పెట్టింది. అలాగే పెట్రోల్, డీజిల్ విషయాల్లో ప్రభుత్వం విధానాలను రూపొందించే సమయంలో పెట్రోల్ బంకు యాజమాన్యాన్ని కూడా సంప్రదించాలని తెలిపింది. ఇక పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించిన ధరలను నియంత్రించే అధికారం ప్రభుత్వం వద్దే ఉండాలని పేర్కొంది. ఈ డిమాండ్లకు 15 రోజుల్లో పరిష్కారం చూపకపోతే దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులను మూసివేస్తామని స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications
