Tiruparankundram Deepam: కొండపై వెలగని దీపం-సుప్రీం ఉత్తర్వుల్నీ లెక్కచేయని విజయ్..!
తమిళనాడులోని మధురైలోని తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం (Tiruparankundram Deepam) వెలిగించే వ్యవహారం ఇవాళ మరో మలుపు తిరిగింది. ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా కొండపైని స్థూపంపై దీపం వెలిగించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. దీన్ని విజయ్ సర్కార్ వ్యతిరేకిస్తూ అనుమతి ఇవ్వకపోవడంతో ఈ వివాదం మద్రాస్ హైకోర్టుకు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు చేరింది. దీంతో ఈ ఒక్క ఏడాది మాత్రం కార్తీక దీపం కొండపై ఉన్న దీపస్దూపంపై చేసుకోవచ్చని సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. అయినా విజయ్ సర్కార్ మాత్రం వెనక్కుతగ్గలేదు.
తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించాల్సిందేనంటూ పట్టుబట్టిన బీజేపీ నేతలు ఇవాళ తమిళనాడులో పలు చోట్ల ఆందోళనలు చేపట్టారు. అయితే పోలీసుల్ని భారీ ఎత్తున మోహరించిన ప్రభుత్వం వారిని హౌస్ అరెస్టులు, రోడ్లపై అరెస్టులు చేసింది. దీంతో సాయంత్రానికి కార్తీక దీపం వెలుగుతుందా లేదా అన్న టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో కొండపై కాకుండా ఎప్పుడూ వెలిగించే
సంప్రదాయ ప్రదేశమైన ఉచ్చి పిళ్లయార్ ఆలయం సమీపంలోని దీప మండపంలో కార్తీక దీపాన్ని వెలిగించారు. అరుళ్లిగు సుబ్రమణ్యస్వామి ఆలయ అర్చకులు సంప్రదాయ దీప మండపం వద్ద దీపారాధన నిర్వహించారు.

ఈ ఏడాదికి మాత్రం కొండపై కార్తీక దీపం వెలిగించుకోవచ్చంటూ సుప్రీంకోర్టు ఈ నెల 20న అనుమతించింది. దీనికి తగిన ఏర్పాట్లు చేయాలంటూ విజయ్ సర్కార్ ను మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. అయినా విజయ్ సర్కార్ మాత్రం పట్టించుకోలేదు. కొండ కింద అరుళ్లిగు సుబ్రమణ్యస్వామి స్వామి ఆలయం, కొండపైన సికిందర్ బాదుషా దర్గా ఉంది. అదే కొండపై శివాలయం కూడా ఉంది. దీంతో ఈ వ్యవహారం సున్నితంగా మారింది. దీపస్దూపం ఆలయానికి చెందిందని, దానిపై దీపం వెలిగించే సంప్రదాయానికి మద్దతుగా దాదాపు వందేళ్ల నాటి సివిల్ కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని హిందూ సంఘాలు వాదిస్తున్నాయి. అయితే దర్గా సమీపంలో దీపం వెలిగించడాన్ని దర్గా అధికారులు, ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయ్ సర్కార్ చారిత్రక ఆధారాల పేరుతో కొండ కింద ఉన్న ఆలయంలోనే దీపారాధన కార్యక్రమం పూర్తి చేసింది.














Click it and Unblock the Notifications
