స్టాలిన్ ను ఓడించిన ఎమ్మెల్యే పాడె మోసిన విజయ్..! జెయింట్ కిల్లర్ కు తుది వీడ్కోలు..!
తమిళనాడులో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ను ఓడించి జెయింట్ కిల్లర్ గా రికార్డుల్లోకి ఎక్కిన టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు నిన్న హఠాన్మరణం చెందారు. సడన్ గా అనారోగ్యం పాలైన ఆయన ప్రాణాలు విడిచారు. దీంతో ఇవాళ ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఇవాళ ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరైన తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (Vijay) తన అభిమాన ఎమ్మెల్యే పాడె మోశారు.
తమిళనాడు ఎన్నికల్లో కొలత్తూరు స్ధానంలో అప్పటి సిట్టింగ్ సీఎం ఎం.కే స్టాలిన్ పై టీవీకే తరఫున ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన వీఎస్ బాబు 3 వేలకు పైగా ఓట్లతో ఆయన్ను ఓడించి పెను సంచలనం సృష్టించారు. దీంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. అయితే నిన్న ఉన్నట్లుండి గుండెపోటుకు గురైన వీఎస్ బాబు అక్కడికక్కడే తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన సొంత పార్టీ టీవీకే విషాదంలో మునిగిపోయింది. సీఎం విజయ్ కు సన్నిహితుడైన వీఎస్ బాబు మరణంతో ఆయన కూడా షాకయ్యారు.

నిన్న ఎమ్మెల్యే వీఎస్ బాబు పార్ధివ దేవాన్ని సందర్శించిన సీఎం విజయ్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అంతటితో ఆగకుండా ఇవాళ అంత్యక్రియలకు నేరుగా తరలివచ్చారు. ఇంటి వద్ద వీఎస్ బాబు అంతిమ సంస్కారాల కోసం జరుగుతున్న ఏర్పాట్లలో పాల్గొన్న విజయ్.. ఆ తర్వాత ఆయన పాడె మోసి రుణం తీర్చుకున్నారు. దీంతో విజయ్ తీవ్ర ఆవేదనతో వీఎస్ బాబు పాడె మోస్తున్న దృశ్యాలు ఆయన అభిమానులతో పాటు టీవీకే శ్రేణుల్ని, తమిళ ప్రజల్ని కన్నీరు పెట్టించాయి. వీఎస్ బాబు అంతిమ యాత్రలో భాగంగా కాసేపు పాడె మోసిన విజయ్.. ఆ తర్వాత మృతదేహం ఉంచిన వాహనం వెనుకే పార్టీ నేతలతో కలిసి నడిచారు. చివరికి ఆయన అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నారు. తద్వారా జెయింట్ కిల్లర్ కు విజయ్ అంతిమ వీడ్కోలు పలికారు.













Click it and Unblock the Notifications
