యోగి ఆదిత్యనాథ్ తల్లి కన్నుమూశారు: అంత విషాదంలోనూ ట్యాబ్స్ పంపిణీ చేసిన సీఎం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి సావిత్రీ దేవి కన్నుమూశారు. ఆమె వయస్సు 91 సంవత్సరాలు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని పౌడీ గఢ్వాల్ జిల్లాలో గల తన స్వగ్రామం పంచూర్ నివాసంలో చికిత్స తీసుకుంటోన్నారు. పరిస్థితి విషమించడంతో ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని జిల్లా అధికారులు ధృవీకరించారు.
ఆమె మరణవార్త తెలియడంతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి. ఆమె మృతి పట్ల ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. తల్లి అనురాగం, ఆప్యాయత, మాతృమూర్తి ఆశీస్సులు జీవితంలోనే అత్యంత విలువైన సంపదని, ఆమెను కోల్పోవడం ఏ కుటుంబానికైనా తీరని లోటని పేర్కొన్నారు. యోగి ఆదిత్యనాథ్, కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని కేదారినాథుడిని ప్రార్థిస్తోన్నానని అన్నారు.

తల్లి మరణవార్త తెలిసే సమయానికి యోగి ఆదిత్యనాథ్.. గోరఖ్‌పూర్‌లో ఓ అధికారిక కార్యక్రమంలో ఉన్నారు. 50,000 మంది విద్యార్థులకు ఉచితంగా టాబ్లెట్లు పంపిణీ చేసే కార్యక్రమం ఇది. మాతృవియోగం గురించిన సమాచారం అందినప్పటికీ.. ఆయన దీన్ని కొనసాగించారు. వేలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసిన అనంతరం ఉత్తరాఖండ్ కు బయలుదేరి వెళ్లారు.
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాతృమూర్తి సావిత్రీ దేవి (91) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోసహజ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, ఉత్తరాఖండ్‌లోని పౌడీ గర్హ్వాల్ జిల్లా పంచూర్ గ్రామంలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. తల్లి మరణవార్త తెలియడంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కుటుంబంతో పాటు ఆయన మద్దతుదారులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు, వివిధ రంగాల దిగ్గజాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
పంచూర్.. యోగి ఆదిత్యనాథ్ సొంత ఊరు. ఆయన బాల్యం, పాఠశాల విద్య అంతా ఇక్కడే సాగింది. తదనంతరం యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తోన్నప్పటికీ కూడా సావిత్రీ దేవి మాత్రం ఆడంబరాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. తన సొంత గ్రామంలో సాధారణ జీవనం గడపడానికే మొగ్గు చూపారు. ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిష్త్ 2020 లో ఇదే ఊరిలో కన్నుమూశారు. అప్పట్లో సకాలంలో తండ్రి అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు.
పాలనా బాధ్యతల్లో తీరిక లేకుండా ఉన్నప్పటికీ.. యోగి ఆదిత్యనాథ్.. తల్లితో రోజూ మాట్లాడేవారు. క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకునే వారు. 2022 మే లో పంచూర్ సందర్శించారు. తల్లి ఆశీస్సులు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అనంతరం 2024 జూన్ లో సావిత్రి దేవి అనారోగ్య కారణాలతో రిషీకేశ్ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరినప్పుడు కూడా యోగి ఆదిత్యనాథ్ అక్కడికి వెళ్లారు. ధైర్యం చెప్పారు.
సావిత్రీ దేవి భౌతికకాయానికి పంచూర్ లోనే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తోన్నారు. ఆమె మరణవార్త తెలుసుకున్న పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ప్రజాప్రతినిధులు యోగి ఆదిత్యనాథ్‌కు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.














Click it and Unblock the Notifications
