"విజయ్ చారిత్రక తప్పిదం?"-అన్నామలై ఫైర్- తమిళనాట నిరసనలు..!
సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాతమిళనాడులోని మధురైలో ఉన్న తిరుపరంకుండ్రం కొండపై ఇవాళ కార్తీక దీపం వెలిగించకపోవడంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. కొండపై దీపస్ధూపాన్ని కాదని కొండ కింద ఆలయంలో దీపారాధన నిర్వహించడంపై బీజేపీ నేతల నుంచి మొదలుపెట్టి హిందూ సంఘాలు, సాధారణ భక్తులు, చిత్ర పరిశ్రమకు చెందిన వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో మాజీ బీజేపీ నేత అన్నామలై (Annamalai) కూడా విజయ్ సర్కార్ పై మండిపడ్డారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారంతో పరిపాలించే వ్యక్తి. న్యాయస్థానాలు ప్రజాస్వామ్యానికి గొప్ప స్తంభాలుగా నిలుస్తాయని అన్నామలై ఇవాళ ట్వీట్ చేశారు. ప్రభుత్వం తన సొంత ఇష్టాయిష్టాలకు లొంగిపోకుండా, న్యాయస్థానాల తీర్పులను నిజాయితీగా అమలు చేసినప్పుడే న్యాయం నెగ్గుతుందన్నారు. టీవీకే ప్రభుత్వం ఇప్పుడు తిరుపరంకుండ్రం దీపా స్థూపం కేసులో న్యాయస్థానాల తీర్పులను ధిక్కరిస్తూ ఏకపక్షంగా వ్యవహరించిందన్నారు.

ఒక సామాన్య పౌరుడిగా, దీని పర్యవసానాలు ఎంత వినాశకరంగా ఉంటాయో తాను స్పష్టంగా చూడగలుగుతున్నానని అన్నామలై పేర్కొన్నారు. కానీ అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఈ విషయం అర్థం కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి తిరు విజయ్ చుట్టూ ఉన్నవాళ్లు ఆయనను తప్పుదోవ పట్టిస్తూ, ఆయన చుట్టూ ఒక భ్రమల గోడను నిర్మిస్తున్నట్లుగా నిజంగా అనిపిస్తోంది. ఆయన దానిని ఛేదించుకోకపోతే, నష్టపోయేది ఆయనే అని తేల్చేశారు. కారణం ఏదైనా కావచ్చు రాజకీయాలు, అజ్ఞానం, లేదా సంకీర్ణ భాగస్వాముల ఒత్తిడి, రాజ్యాంగ చట్టానికి అనుగుణంగా పరిపాలిస్తామని ప్రతిజ్ఞ చేసిన టీవీకే ప్రభుత్వం, ఈ రోజు ఎప్పటికీ సరిదిద్దలేని ఒక చారిత్రాత్మక తప్పిదాన్ని చేసిందన్నారు.













Click it and Unblock the Notifications
