యూఏఈలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి.. మృతుల్లో భారతీయులు
యూఏఈ లోని రాస్ ఆల్ ఖైమా ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కొంతమంది భారతీయులు కూడా ఉన్నారని సమాచారం. ఈ ఘటనను దుబాయ్ లోని భారత దౌత్య కార్యాలయం ధృవీకరించింది. ఇక ఇప్పటికే తాము మృతుల కుటుంబాలను కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేశామని తెలిపింది. అలాగే ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొంది. ఇక ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే బస్సులో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ఆగి ఉన్న ట్రక్కును బస్సు ప్రమాదవశాత్తు ఢీ కొట్టినట్లు స్పష్టం అవుతోంది.
ఇక ఈ ప్రమాదంలో భారతీయులు కూడా మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. కానీ ఎంతమంది మృతి చెందారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదే ఘటనపై యూఏఈ ఇంటీరియర్ మినిస్టర్ మాట్లాడుతూ.. ఓ ప్యాసింజర్ బస్సు- ట్రక్కు ఢీ కొన్న ఘటనలో ఇప్పటివరకూ 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్పష్టం చేశారు. ఘటనాస్థలిలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వివరించారు. ఇక ఈ ఘటన రాస్ అల్ ఖైమా ప్రాంతంలోని అల్ వాటన్ రోడ్డులో జరిగిందని పేర్కొన్నారు. ఇక గల్ఫ్ న్యూస్ అందించిన సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో మరో 14 మంది గాయపడినట్లు తెలుస్తోంది.

ఇక ఈ ప్రమాదానికి గల కారణం బస్సులో ఆకస్మాత్తుగా సాంకేతిక సమస్య రావడమేనని ఖలీజ్ టైమ్స్ న్యూస్ పేపర్ స్పష్టం చేసింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపింది. మరోవైపు ఈ ప్రమాద ఘటనపై ఇండియన్ మిషన్ అధికారిక ఎక్స్ లో పోస్టు పెట్టింది. " రాస్ ఆల్ ఖమియా లో జరిగిన ఈ రోడ్డు ప్రమాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ప్రమాదంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో భారతీయులు కూడా ఉన్నారు" అని స్పష్టం చేసింది. అలాగే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం, వివరాల కోసం 800-4632 టెలిఫోన్ హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఇక యూఏఈలోని ఫుజైరా ప్రాంతంలో కొద్ది రోజుల క్రితమే జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోగా.. వారిలో నలుగురు భారతీయులు ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications
