అయ్యో.. కార్తికదీపం మంటల్లో కాలిపోయిన మహిళ.. ఏం జరిగింది..?
నవంబర్ 24 కార్తికపౌర్ణమి సందర్భంగా దేశవ్యాప్తంగా పండగ వాతావరణం సంతరించుకుంది. భక్తులంతా కార్తికదీపాలు వెలిగిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. ఇటు హైదరాబాద్ లోనూ ప్రతి ఇంట్లో కార్తిక దీపాలు వెలిగించడం.. ఉపవాసాలు ఉండటం.. అలాగే శివనామస్మరణ చేయడం చేస్తున్నారు. మరికొంత మంది భక్తులు దేవాలయాలకు వెళ్లి దర్శనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నగరం మొత్తం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
అయితే ఈ పండగ వేళ హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ లోని జగన్నాథ్ రెసిడెన్సీలో తీవ్ర విషాదం నెలకొంది. కార్తిక దీపాలు వెలిగిస్తుండగా జరిగిన అగ్నిప్రమాదంలో చాపర్ల భానుమతి (64) అనే మహిళ మృతి చెందారు. దీపాలు వెలిగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆమె చీరకు నిప్పు అంటుకుంది. క్షణాల్లోనే మంటలు ఆమె శరీరం మొత్తం వ్యాపించాయి.
ఈ క్రమంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే వెంటనే భానుమతిని కుటుంబ సభ్యులు సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె పరిస్థితి సీరియస్ గా ఉండటంతో అక్కడి నుంచి బంజారా హిల్స్ లోని మరో ఆస్పత్రికి తరలించారు. అయితే భానుమతి అక్కడే చికిత్స పొందుతూ మరణించారు. తమకళ్ల ముందే అప్పటివరకూ సంతోషంగా దీపాలు వెలిగించిన ఆ తల్లి మృతి చెందడంపై పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారి ఆర్తనాదాలు అక్కడ ఉన్నవారిని కలచివేశాయి.

ఇక ఈ ప్రమాదంలో మృతురాలి ఇంట్లోని సోఫాతో పాటు కొంత ఫర్నీచర్.. గృహోపకరణాలు కూడా పూర్తిగా కాలిపోయాయి. మృతురాలి కుమార్తె కిన్నెర ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications
