UP Elections: సమాజ్ వాదీ పార్టీ తొలి జాబితా రిలీజ్.. కాంగ్రెస్ కు బిగ్ షాక్..
2027 ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సమాజ్ వాదీ పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకూ మరోసారి అవకాశం ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వీరిలో నలుగురు ముస్లిం అభ్యర్థులు కాగా.. మరొకరు ఓబీసీ మహిళ ఉన్నారు. సహరాన్ పూర్ జిల్లాలోని బెహత్ నియోజకవర్గం నుంచి ఉమర్ అలీ ఖాన్, సహరన్ పూర్ నియోజకవర్గం నుంచి ఆశూ మాలిక్, షామ్లీ జిల్లాలోని కైరానా నియోజకవర్గం నుంచి నాహిద్ హసన్ అలాగే అమ్రోహా నియోజకవర్గం నుంచి మహబూబ్ అలీ చివరగా లలిత్ పూర్ నియోజకవర్గం నుంచి జ్యోతి లోధి బరిలో దిగనున్నారు.
అయితే పొత్తులో భాగంగా బెహత్, సహరాన్ పూర్ నియోజకవర్గాలను తమకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది. కానీ సమాజ్ వాదీ పార్టీ మాత్రం ఆ రెండు నియోజకవర్గాల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మరోసారి అవకాశం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు నియోజకవర్గాలను 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ దక్కించుకుంది. మరోవైపు 2027 ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ- కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాల్లో పలు విభేదాలు వస్తున్నట్లు సమాచారం అందుతోంది.

ఉత్తర్ ప్రదేశ్ లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ తొలుత 181 సీట్లను కోరింది. వాటిలో బెహత్, సహరాన్ పూర్ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఇక సోమవారం తొలి విడత సీట్ల పంపకాల చర్చల్లో భాగంగా 130 సీట్లు కావాలని.. సీట్ల జాబితాను ఎస్పీ నేతల ముందు ఉంచింది. కానీ ఎస్పీ మాత్రం కాంగ్రెస్ కు కేవలం 26 సీట్లు ఇచ్చేందుకు మాత్రమే సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది. అలాగే తాజాగా బెహత్, సహరాన్ పూర్ నియోజకవర్గాల్లోనూ ఎస్పీ తమ అభ్యర్థులను ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక మిగిలిన నియోజకవర్గాలపై ఇరు పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications
